రోశయ్య డోలాయమానం హైదరాబాద్ : గడచిన పది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డి టేబుల్ పై ఒక ఫైలు పెండింగ్ లో ఉంది. శాసనసభ కార్యదర్శిగా రిటైరైన తుల్జానంద్ సింగ్ ను ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్ డి)గా నియమించాలనే ప్రతిపాదనకు సంబంధించిన పైలు అది. ఆ అభ్యర్థన స్వయంగా ముఖ్యమంత్రి నుంచే వచ్చినప్పటికీ రమాకాంత రెడ్డి పట్టదు.
కొత్త ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో తాను కోరుకున్న రీతిలో ముందుకు సాగలేకపోతున్నారనేందుకు ఇది ఒక్కటే తార్కాణం కాదు. ఇంతకుముందు కూడా 1983 బ్యాచ్ ఐఎఎస్ అధికారి దినేష్ కుమార్ ను తన ప్రిన్సిపాల్ కార్యదర్శిగా ఆయన నియమించుకోలేకపోయారు. కొన్ని వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడమే ఇందుకు కారణం. రోశయ్య తప్పనిసరిగా అంగీకరించిన తరువాత, ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)లో సి.వి.ఎస్.కె. శర్మ, జవహర్ రెడ్డిలకు స్థానం కల్పించిన తరువాత మాత్రమే కుమార్ ను ఆ పదవిలో నియమించగలిగారు. సిఎంఒ ఇప్పుడు మరీ పెద్దదిగా కనిపిస్తున్నది.
'రోశయ్య సమస్య ఏమిటంటే అతిశయోక్తిగా కనిపించవచ్చునేమో గాని కె.వి.పి. రామచంద్రరావు అంటే భయపడిపోవడమే' అని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి. వైఎస్ఆర్ మిత్రుడు, కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్న సలహాదారు అంటే కొత్త సిఎంకు అంత భయం ఎందుకో ఆ వర్గాలు వివరించలేకపోతున్నాయి. 'బహుశా ఆ భయం మానసికమైనది కావచ్చు. ఎందుకంటే కెవిపికి అధిష్ఠానం వత్తాసు అంత ఎక్కువగా ఏమీ లేదు' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాజశేఖరరెడ్డి తన హయాంలో బదలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన కీలకమైన పాలనా వ్యవహారాలను కెవిపికి అప్పగించారు. వాస్తవానికి తనకు ముందున్న ముఖ్యమంత్రికి ఉన్న నలుగురు సలహాదారులనూ రోశయ్య కొనసాగించడం ఆశ్యర్యంగా ఉందని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పాలనా వ్యవహారాలలో తన ఇష్టానుసారం రోశయ్య ముందుకు సాగలేకపోతున్నారనేందుకు సూచిక ఆయన మంత్రులలో చాలా మంది ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డికే తమ మద్దతు అని బాహాటంగా ప్రకటించడమే. చాలా మంది మంత్రులు తమ కార్యాలయాలకు హాజరవుతున్నారని, కాని జగన్ విలేఖరుల గోష్ఠిలో ప్రసంగించినప్పుడు ఆయన చుట్టూ చేరడం వంటి సంకేతాలతో వారు తమ విధేయత ఎవరికో చెప్పకనే చెపుతున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది రోశయ్యను డోలాయమాన స్థితిలోకి నెట్టుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.
Pages: 1 -2- News Posted: 27 October, 2009
|