కాంగ్రెస్ సీనియర్ల కిరికిరి హైదరాబాద్ : అధిష్ఠానం ఎన్నిరకాల మరమ్మతులు చేసినా రాష్ట్ర కాంగ్రెస్ లో రోజుకో వివాదం రేగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రి రభస సద్దుమణిగిందని సంతోషిస్తే ఇప్పుడు మంత్రి పదవుల పోరాటం మొదలైంది. పార్టీ అధ్యక్షపదవి చిచ్చు రగులుతోంది. కాంగ్రెస్ శాసనసభ్యుల్లో, మంత్రుల్లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. వైఎస్ బతికున్నంత కాలం ఆయనకే పరమ విధేయులమని చెప్పుకున్న కొందరు ఇప్పుడు స్వరం మార్చి కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య మంత్రి వర్గాన్ని విస్తరిస్తారన్న ఆలోచనతో మరికొందరు పదవుల కోసం కొత్త వివాదాలను సృష్టిస్తున్నారు. ప్రస్తుతమున్న మంత్రులు అసమర్థులని ఆరోపిస్తూ తమకు గాని పదవులిస్తే పొడిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంతకూ పీసీసీ అధ్యక్షుడు మారతాడో లేదో తెలియదు. మంత్రి వర్గాన్ని విస్తరిస్తారో లేదో తెలియదు. కానీ ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. నాయకులు కత్తులు దూసుకుంటున్నారు.
కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది. ‘అసమర్ధులను తొలగించండి. మాకు అవకాశం కల్పించండి’ ఇప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్యేలు కొత్త పల్లవి అందుకున్నారు. సీనియర్లమైన తమను పక్కనపెట్టి అసమర్థులకు మంత్రి వర్గంలో చోటు కల్పించారని వారు వాదిస్తున్నారు. త్వరలో రాష్ట్ర మం త్రి వర్గ విస్తరణ ఉంటుందంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో కొందరు ఎమ్మెల్యేలు తమ పల్లవి వినిపించడం యాదృచ్చికమా? లేకా వ్యూహాత్మకంగానే పార్టీ పెద్దలు వారితో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత మంత్రి వర్గంలో ఇంకా సుమారు 10 మంది కొత్తవారిని తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు అయిన డిఎల్ రవీంద్రారెడ్డి, పి.శంకరరావు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది మంత్రులపై విమర్శలు సంధించారు.
Pages: 1 -2- News Posted: 28 October, 2009
|