చెన్నై : మీరు చికెన్ తినేవారైతే మీ సందర్శన ప్రదేశాల జాబితాలో నుంచి కేరళను తొలగించండి. తమిళనాడులోని చికెన్ సప్లయర్లకు ప్రమేయం ఉన్న పన్ను ఎగవేత కుంభకోణం పర్యవసానంగా కేరళలో చికెన్లకు కొరత ఏర్పడగా తమిళనాడులో వాటి నిల్వలు పెరిగిపోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితి తలెత్తింది. కేరళకు రోజూ రవాణా అయ్యే చికెన్లలో 60 శాతం తమిళనాడు నుంచే వస్తున్నాయి. రూ. 13 కోట్లు విలువ చేసే ఈ కుంభకోణం రెండు వారాల క్రితం బట్టబయలైన తరువాత పల్లడం-పొంగళూరు-ఉడుమల్ పేట ప్రాంతంలో తమిళనాడు నుంచి సజీవ చికెన్ల దిగుమతిపై కేరళ ఆంక్షలు విధించింది.
ఫలితంగా తమిళనాడులోని పౌల్ట్రీ ఫామ్ ల నుంచి రోజూ జరిగే లక్ష సజీవ చికెన్ల రవాణా నిలచిపోయింది. కేరళలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేరళలో సజీవ చికెన్ ధర రూ. 15 పెరిగి ఇప్పుడు కిలో రూ. 75 మేర ఉన్నది. మరొకవైపు తమిళనాడులో నిల్వలు పెరిగిపోవడంతో పౌల్ట్రీ రైతులు కిలో రూ. 35 మేర తక్కువ ధరకే చికెన్లను అమ్ముకోవలసి వస్తున్నది. మామూలుగా వారు కిలోకూ రూ. 45 ధర వసూలు చేసేవారు. 'కేరళ విధించిన నిర్హేతుక నిషేధం మా జీవనోపాధిని దెబ్బ తీస్తున్నది. ఒక్కొక్క చికెన్ పై మేము కిలోకు రూ. 20 వరకు నష్టపోతున్నాం' అని పల్లడంలో బ్రాయిలర్ సమన్వయ కమిటీ కార్యదర్శి కె. కణ్ణన్ చెప్పారు.