ప్రతిభ... సుఖోయ్ విహారం న్యూఢిల్లీ : శబ్దం కంటే వేగంగా దూసుకుపోయే విమానంలో ప్రయాణం... సముద్ర గర్భంలో యుద్ధ విన్యాసాలను కళ్ళరా చూడటం... ఇలాంటి సాహసాల్ని ఒకసారైనా చేయాలని, ఆ అనుభూతిని ఆస్వాదించాలని కల... ఈ కల సామాన్యుడికి అత్యాశే.. కానీ రాష్ట్రపతికి నెరవేరే స్వప్నం. అదిగో అలాంటి అరుదైన ప్రయాణాలను చేయాలని భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉబలాటపడుతున్నారు. మాజీ రాష్ట్ర పతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ మార్గాన్ని అనుసరించాలని ఆమె అభిలషిస్తున్నారు. భారత వైమానిక దళం (ఐఎఎఫ్)లో అత్యంత శక్తిమంతమైన సూపర్ సానిక్ ఫైటర్ జెట్ 'సుఖోయ్-30ఎంకెఐ'లో ఎగరాలన్నది ప్రతిభా పాటిల్ ఆకాంక్ష. అయితే, మాజీ రాష్ట్రపతి కలామ్ వలె ఒక జలాంతర్గామిలో సముద్ర గర్భంలో ప్రయాణించడానికి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ ను సందర్శించడానికి కూడా ఆమె ఇష్టపడుతున్నారా అనేది ఇప్పటికి తెలియదు.
నవంబ్ 24, 25 తేదీలలో పుణెలోని లోహెగావ్ వైమానిక స్థావరం నుంచి రెండు సీట్ల సుఖోయ్ లో 'రాష్ట్రపతి గగన విహారానికి' సన్నాహాలు ప్రారంభమయ్యాయని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ నాలుగవ తరం జెట్ విమానంలో గగనంలోకి ఎగసే ముందు ప్రతిభా పాటిల్ వైద్య పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. విమానంలో నుంచి బయటపడే ప్రక్రియతో సహా గగన విహారానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఆమె ముందుగా తెలుసుకోవలసి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 30 October, 2009
|