బుగ్గి అయిన 500 కోట్లు జైపూర్ : జైపూర్ ఆయిల్ డిపోలో మంటలు ప్రజ్వరిల్లిన రెండు రోజుల్లో రూ. 500 కోట్లు విలువ చేసే ఆయిల్ బుగ్గిపాలు కాగా రెండు ప్రశ్నలు తలెత్తాయి. వాటికి ఏ ఒక్కరూ సంతృప్తికరంగా సమాధానం ఇవ్వడం లేదు. అసలు అగ్నిజ్వాలలు ఎలా ప్రారంభమయ్యాయి? గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ అగ్నిబీభత్సంలో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరు?
ఐదుగురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న మరి ఆరుగురు కూడా మృతిచెంది ఉండవచ్చునని అనుకుంటున్నారు. ఐదు మృతదేహాలను వెలికితీశారు. అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ఉద్యోగుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇంకా అనేక మంది నగరంలోని ఆసుపత్రులలో విషమ స్థితిలో ఉన్నారు. 'ఈ ఉద్యోగులు మృతిచెందారా అనేది తెలియదు. కాని మంటల లేచిన సమయంలో వీరు డిపోలోనే ఉన్నారు. మరణించినట్లుగా ప్రకటించిన వ్యక్తులు గురువారం నుంచి వివిధ ఆసుపత్రులలో చేర్పించినవారు' అని రాజస్థాన్ హోమ్ శాఖ కార్యదర్శి ప్రదీప్ సేన్ చెప్పారు.
శుక్రవారం ఉదయం పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కాని ఈ ప్రమాదం ఎలా సంభవించిందో, ఇది ఎలా అదుపు తప్పిపోయిందో ఆయన వివరంగా చెప్పలేకపోయారు. జైపూర్ సీతాపురా పారిశ్రామిక ప్రాంతంలోని ఆయిల్ డిపోలో గల 11 ఐఒసి ట్యాంకర్లలో గల లక్ష కిలో లీటర్ల ఇంధనం అలా కాలిపోక తప్పదనే అభిప్రాయానికి ఆయన వచ్చారు.
అయితే, నిపుణులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానవ తప్పిదం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని వారి అభిప్రాయం. సకాలంలో చర్య తీసుకుని ఉంటే నష్టం తీవ్రతను తగ్గించి ఉండవచ్చని అంటున్నవారు కూడా లేకపోలేదు. 'ప్రమాద సంకేతాలు వచ్చాయి. ఆయిల్ వాసన వెలువడింది. అధికారులు దీనిని హెచ్చరికగా భావించి వెంటనే చర్య తీసుకుని ఉండాలి. కాని వారు యథాలాపంగా వ్యవహరించారు. పర్యవసానంగా పరిస్థితులు అదుపు తప్పిపోయాయి' అని జామ్ నగర్ నుంచి వచ్చిన నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.
'అగ్ని ప్రమాదం, పేలుడు జరగడానికి కొన్ని గంటల ముందు మాకు ఐఎసి ప్రాంగణంలో నుంచి సైరన్లు వినిపించాయి. మొత్తం ప్రాంతమంతా ఆయిల్ వాసన వేసింది. మరి ఎందుకు సకాలంలో నివారణ చర్యలు తీసుకోలేదు' అని ఐఒసి డిపో సమీపంలోని ఫ్యాక్టరీ జీనస్ లో పనిచేసే మహమ్మద్ జబ్బాల్ పేర్కొన్నారు. ఆయన ఫ్యాక్టరీ దగ్ధమైంది. ఆయనకు కొన్ని శకలాలు గుచ్చుకుని గాయాలయ్యాయి. ఆయన ఇప్పుడు సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Pages: 1 -2- News Posted: 31 October, 2009
|