మహేంద్రగిరికి మావోలు? హైదరాబాద్ : దండకారణ్యంలో సంకుల సమరం తప్పేటట్టు లేదు. మరో లాల్ ఘర్ తరహా ఉదంతాలకు మహేంద్రగిరి పర్వత సానువులు ఆలవాలం కాబోతున్నాయి. దండకారణ్యంలో నుంచి మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో కీలక నేతలు ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న సీనియర్ నేత నంబాల కేశవరావు, మరో కీలక సభ్యుడు చలపతి వంటివారు ఎఓబిలో బసచేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగా చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ప్రత్యేక బలగాల యూనిట్, ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ను నెలకొల్పేందుకు కేంద్రం ఆమోదించింది. ఇక్కడ 1800 ఎకరాల స్థలంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పనుంది. ఇలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 300 ఎకరాల ఎయిర్ బేస్ ను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే 40 వేల సంఖ్యలో సిఆర్ పిఎఫ్, ఐటిబిఎఫ్, బిఎన్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. దీనికి తోడు రాష్ట్రీయ రైఫిల్స్ త్వరలో దండకారణ్యానికి పంపనున్నారు. గాలింపు చర్యలు చేసే పారామిలిటరీ బలగాలకు ఆరు ఎంఐ-17 ఐఎఫ్ఎప్ చోపర్లను సహాయంగా వినియోగించనున్నారు. క్లిష్టపరిస్థితిల్లో చిక్కుకున్న పారామిలిటరీ బలగాలను రక్షించేందుకు గరుడ పేరు కలిగిన వైమానిక దళాలను రంగంలోకి దింపారు. ఏడు ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు చేసేందుకు ప్రణాళికను ఖరారు చేశారని యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో ఆరితేరిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముందుగా మూడు ప్రదేశాల్లో పారామిలిటరీ బలగాలను దింపారు.
బస్తర్ ప్రాంతంలో కంకేర్ వైపు, మహారాష్ట్రలో గడ్చిరోలి, మావోయిస్టుల కోటగా భావిస్తున్న అబూజ్ మాడ్ లో కేంద్ర పారామిలిటరీ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకుని ముందుకు కదిలేందుకు ప్రణాళిక ఖరారైంది. మొదటి దాడి నవంబర్ లో ప్రారంభమవుతుందని అంటున్నారు. రకాలుగా దాడి ఉంటుంది. చత్తీస్ గఢ్ ఏరియాల్లో ఆపరేషన్లను మొదలు పెట్టి, ఈ ప్రాంతాలకు చేరువల్లో ఆరవేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అబూజ్ మాడ్ అడవులకు కేంద్రా పారామిలిటరీ బలగాలు చేరుకుంటాయి. అబూజ్ మాడ్ కు అన్ నోన్ జంగిల్స్ అని బ్రిటీష్ వారు నామకరణం చేశారు. ఈ ప్రాంతాన్ని ఇంతవరకు సర్వే చేయలేదు. అబూజ్ మాడ్ ను వశం చేసుకున్న తర్వాతనే ఇతర ప్రాంతాలపై దాడి చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భావిస్తోందని పోలీసులు వర్గాలు తెలిపాయి.
ఆపరేషన్ ఏరియా - 1 పూర్తయిన తర్వాత రెండో దశలో ఆపరేషన్ ఏరియా-2ను ప్రారంభిస్తారు. ఈ ఆపరేషన్ ను దంతేవాడ, నారాయణ్ పూర్, బస్తర్లో సాగుతుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇప్పటికే స్పెషల్ ఫోర్సస్ స్కోలు, స్పెషల్ ఫోర్సస్ యూనిట్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రష్యాలో తయారైన ఆరు హెలికాప్టర్లు పారామిలిటరీ బలగాలకు లాజిస్టికల్ సపోర్టు ఇచ్చేందుకు రెడీ చేశారు. వీటిలో రెండు హెలికాప్టర్లను నాగ్ పూర్ లో , రెండు హెలికాప్టర్లను జగదల్పూర్ లో ఉంచుతున్నారు. మిగిలిన రెండు హెలికాప్టర్లను ఒరిస్సాలోని మల్కాన్ గిరిలో ఉంచుతున్నారు. అవసరమైతే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
Pages: 1 -2- News Posted: 2 November, 2009
|