పెటాకులైన పొత్తు హైదరాబాద్ : పొత్తు పెటాకులైంది. తాంబూలం పుచ్చుకున్న రోజే తన్నులాటలు మొదలు కావడంతో వియ్యం కాస్తా వికటించింది. కాంగ్రెస్ - ప్రజారాజ్యం రాజకీయ రొమాన్స్ ఇరవై నాలుగు గంటల్లోగానే ముగిసిపోయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకూ కాంగ్రెస్ వినిపించిన కథలు విని విని విసిగిపోయిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గ్రేటర్ ఎన్నికల్లో ఏకపాత్రాభినయానికే సిద్ధపడిపోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మధ్య నడచిన పొత్తు ఎత్తుగడలు చివరకు విషాదాంతంగానే ముగిశాయి.
రాష్ట్రంలోని రాజకీయవర్గాలను విస్మయానికి గరిచేసి, కాంగ్రెస్ లో కలతలు సృష్టించిన ఈ ప్రహసనంలో రెండు పార్టీల అధ్యక్షులూ పరువు పోగొట్టుకున్నరు. అధిష్టానం అనుమతి తీసుకున్న రాష్ట్ర స్థాయి నాయకులతో సమగ్రంగా చర్చించకుండా, అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రజారాజ్యంతో పొత్తు కోసం ఒంటెత్తు పోకడకు పోయారన్న అపకీర్తి పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌కు దక్కింది. ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టమేమిటని జోగయ్య లాంటివారితో ముందస్తు ప్రకటనలు చేయించి, గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న చిరంజీవి కల చివరకు మొయిలీ ప్రకటనతో అలాగే మిగిలిపోయింది. మొయిలీ వ్యాఖ్యల ప్రకారం ఇక పొత్తు చర్చలు అనవవసరమన్న తుది నిర్ణయానికి పీఆర్పీ నేతలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో మంగళవారం మరోమారు చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది.
Pages: 1 -2- News Posted: 2 November, 2009
|