సుష్మా 'మాతే' గతి! న్యూఢిల్లీ : కర్నాటక సంక్షోభం నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని రక్షించేందుకు పలు ఆఫర్లతో బళ్ళారిలోని తన 'కుమారుల'ను దారిలోకి తేవడానికి సుష్మా స్వరాజ్ ప్రయత్నించనున్నారు. రెడ్డి సోదరులతో మాట్లాడి, మూడు సూత్రాల పరిష్కారాన్ని ప్రతిపాదించవలసిందిగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఎల్.కె. అద్వానీ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సుష్మా స్వరాజ్ ను కోరారు. లోక్ సభలో ఉప ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ 1999లో బళ్ళారిలో సోనియా గాంధిపై పోటీ చేసినప్పటి నుంచి రెడ్డి సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రెడ్డి సోదరుల పూర్వీకుల ఇంటిలోఇప్పటికీ సుష్మా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ పూజ చేస్తుంటారు.
రెడ్డి సోదరులు - మంత్రులు గాలి జనార్దన్, కరుణాకర్, ఎంఎల్ఎ సోమశేఖర్ నాలుగు సంవత్సరాల క్రితం తమ తల్లి మరణించిన తరువాత సుష్మాను తమ 'తల్లి'గా చెప్పుకుంటుంటారు. 'మాత సుష్మా పెడతోవ పట్టిన తన కుమారులను ఎలా దారిలోకి తెస్తారో చూద్దాం' అని బిజెపి నాయకుడు ఒకరు అన్నారు.
బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, రెడ్డి సోదరులకు చేయనున్న ప్రతిపాదనలు ఇవి: పలువురు ఎంఎల్ఎలను, మంత్రులను వెనుకకు నెట్టిన మంత్రి, ఆంతరంగికుడు శోభా కరాంద్లజెకి, హోమ్ శాఖ మంత్రి వి.ఎస్. ఆచార్యకు ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్ప ఉద్వాసన పలుకుతారు. బదలీలు, పోస్టింగ్ లకు సంబంధించి ఉభయ పక్షాలకు చెందిన మంత్రులు, కేంద్ర నాయకుడు అనంత కుమార్ తో సహా ఒక ప్యానెల్ రూపంలో సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. బళ్ళారిలో కొన్ని బదలీలను రద్దు చేస్తారు. బళ్ళారితో సహా వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళే ట్రక్కులపై విధించిన సెస్ ను ఉపసంహరిస్తారు.
Pages: 1 -2- News Posted: 2 November, 2009
|