కోడా- అవినీతి కొండ రాంచి : ముంబైలో హోటళ్లు, మూడు కంపెనీలు. కోలకతాలో ఆస్తి. థాయిలాండ్ లో ఒక హోటల్. లైబీరియాలో ఒక బొగ్గు గని... ఒకప్పుడు కూలీగా జీవితం గడిపి క్రమంగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన 38 సంవత్సరాల మధు కోడా అక్రమంగా సాగించిన విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు, సంపాదించిన ఆస్తులలో తాము గుట్టు రట్టు చేసినవి ఇవి కొన్ని అని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తెలియజేసింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 4000 కోట్లు అని తెలుస్తున్నది. ఒకప్పుడు పాలించిన ఝార్ఖండ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఇది దాదాపు ఐదింట ఒక వంతు. మధు కోడా 35 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. 2005లో ఆయన ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ మొత్తం రూ. 12 లక్షలు. 1990 దశకం వరకు కిటికీ గ్రిల్స్ తయారు చేసేవాడు కోడా, ఇనుప ఖనిజం గనులలో కూలీగా కూడా పని చేసిన తర్వాత కాలంలో రాజకీయ నాయకుని అవతారం ఎత్తి ఏకంగా ఝర్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్నే అధిష్టించాడు.
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా తాను అక్రమంగా ఆర్జించిన సంపద విషయంలో దర్యాప్తు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను (ఐటి) శాఖతో పూర్తిగా సహకరించడం లేదని సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలియజేశారు. విదేశీ మారక ద్రవ్యం నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు నిర్వహించే ఇడి, ఐటి శాఖ వరుసగా మూడవ రోజు కూడా దేశవ్యాప్తంగా దాడులు సాగించాయి. దర్యాప్తు అధికారులు మధు కోడాను రహస్యంగా ప్రశ్నించారు. ఝార్ఖండ్, ముంబై, ఢిల్లీలలోని కోడా సన్నిహిత సహచరులు ఆరుగురికి ఐటి శాఖ నోటీసులు పంపి నవంబర్ 6న రాంచిలో అదనపు డైరెక్టర్ (దర్యాప్తు) ముందు హాజరై, 'కొన్ని లావాదేవీలు, సంఘటనల' గురించి వివరించవలసిందిగా కోరింది.
ఏవేవి స్వాధీనం చేసుకున్నామో ఐటి శాఖ తనతో చెప్పలేదని కోడా న్యాయవాది రాహుల్ కుమార్ తెలియజేశారు. 'స్వాధీనం చేసుకున్న పత్రాల జాబితా మాకు అందనిదే ప్రస్తుత సోదాలపై వ్యాఖ్యానించడం సబబు కాదు' అని రాహుల్ కుమార్ అన్నారు. తాను కోడా నివాసానికి వెళ్ళానని, 'కాని కోడా నివాసంలో సోదాలు సాగిస్తున్న ఐటి అధికారులు ఆయనను కలుసుకోవడానికి నన్ను అనుమతించలేదు' అని కుమార్ చెప్పారు. 'సోదాలు పూర్తయిన తరువాత రావలసిందని నాతో వారు చెప్పారు' అని కుమార్ తెలిపారు. ఐటి అధికారులు పంపిన నోటీసులకు కోడా సమాధానం ఇచ్చారని కుమార్ తెలిపారు. ద్రవ్య దుర్వినియోగానికి పాల్పడినట్లు కోడాపై ఇడి అభియోగాలు దాఖలు చేసిన తరువాత వారు ఆయనకు ఎటువంటి నోటీసూ పంపలేదని కుమార్ చెప్పారు.
'కోడా హవాలా (చట్టవిరుద్ధంగా విదేశీ మారక ద్రవ్య బదలాయింపులు) లావాదేవీల ద్వారా అక్రమంగా సంపాదించిన ధనాన్ని యుఎఇ, దుబాయి, మలేషియా, ఇండోనీషియా, థాయిలాండ్ మొదలైన దేశాలకు తరలించడానికి వారు (కోడా, ఆయన సహచరులు) ముంబైని ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకున్నారు' అని ఇడిలో ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలియజేశారు. మీడియాతో మాట్లాడేందుకు తనకు అధికారం లేదు కనుక తన పేరు వెల్లడి చేయవద్దని ఆయన కోరారు. 'ఇది ఒక భారీ ప్రక్రియ. దేశంలోని తొమ్మిది నగరాలలో 70 భవనాలలో ఈ దాడులు సాగినందున మేము కచ్చితమైన గణాంకాలు రూపొందించడానికి ఆ వివరాలను ఇంకా మదింపు చేస్తూనే ఉన్నాం' అని ఆయన తెలిపారు.
Pages: 1 -2- News Posted: 3 November, 2009
|