రామదేవ్ - 'అల్లా' యోగా లక్నో : యోగా గురు బాబా రామదేవ్ మంగళవారం ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింలు గణనీయమైన పాత్ర పోషించారని గుర్తు చేసినప్పుడు ఐదు లక్షల మంది సభికులు హర్షధ్వానాలు చేశారు. వారిలో అత్యధిక సంఖ్యాకులు ముస్లింలే. దేశంలోని ప్రముఖ ఇస్లామ్ మత సంస్థలో ముస్లిమేతర మత నాయకుడు ఒకరు ప్రసంగించడం ఇదే ప్రథమం. ఉత్తర ప్రదేశ్ దేవ్ బండ్ లోని దారుల్ ఉలూమ్ లో ఈ సభకు హాజరైన పది వేల మంది మౌల్వీలలో అనేక మంది సమైక్య భారతానికి యోగా గురు ఇచ్చిన పిలుపు పట్ల, మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఆయన కోరడం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. రామదేవ్ త్వరలోనే ఈ సంస్థ వద్దకు తిరిగి రావచ్చు. ఎందుకంటే ఆయన నిర్వహించవలసి ఉన్న యోగ ప్రదర్శనను మరొక రోజుకు వాయిదా వేశారు.
'యోగాపై ఆయన ఈ సభలో మాట్లాడకపోయినప్పటికీ, చాలా మంది మౌలానాలకు యోగాసనాలు వేయడంపై ఆసక్తితో ఉన్నారు. మా మౌలానాలకు యోగాసనాలలో శిక్షణ ఇచ్చేందుకు ఆయనను మరొకసారి పిలిపించవచ్చు' అని దేవ్ బండ్ అధికార ప్రతినిధి ముంతాజ్ ఆలమ్ చెప్పారు. దేశంలోని అతి పెద్ద ముస్లిం సంస్థలలో ఒకటైన, దారుల్ ఉలూమ్ కు మాతృ సంస్థ అయిన జమియాత్ ఉలేమా-ఇ-హింద్ వార్షిక సమ్మేళనంలో రామదేవ్ ప్రసంగిస్తూ, 'స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింలు పోషించిన పాత్రను మేము మరవజాలం' అని అన్నారు. 'మత ప్రాతిపదికపై ప్రజలను విడదీసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, మనం సమైక్యంగా ఉండి తీరాలి. మనం ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే' అని ఆయన పేర్కొన్నారు.
1857 స్వాతంత్ర్య సంగ్రామంలో అవధ్ రాణి బేగమ్ హజ్రత్ మహల్ బ్రిటిష్ వారితో పోరాడిన తీరును, దేశంలో చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వివిధ తిరుగుబాటు వర్గాలను ఏవిదంగా సమైక్యం చేసిందీ రామదేవ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'నవ భారత అస్థిత్వం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో సమైక్యంగా ఉండవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడడం ద్వారా ఆయన మా మనస్సులను చూరగొన్నారు' అని దేవ్ బండ్ అధికార ప్రతినిధి ఆలమ్ చెప్పారు. శ్రీశ్రీ రవిశంకర్ ను కూడా జమియాత్ ఆహ్వానించింది. కాని ఆయన రాలేకపోయారు. ఒక సందేశంతో ఆయన ఒక దూతను పంపారు.
Pages: 1 -2- News Posted: 4 November, 2009
|