మళ్లీ ఇవిఎంల గోల హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రం (ఇవిఎం)ల పని తీరుపై తిరిగి అనుమానాలు తలెత్తాయి. ఇవిఎంలు లోపరహితాలు కావని, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పలువురు అభ్యర్థుల పరాజయం ఇందుకు మరొక ఉదాహరణ అని, ఇది తమ వాదనకు బలం చేకూరుస్తున్నదని నెట్ ఇండియా సంస్థ చెబుతున్నది.
ఇవిఎంలపై అభ్యర్థుల పేర్లను పొందుపరిచే సమయంలో కూడా అక్రమాలకు వీలుగా మార్పులు చేయవచ్చునని నెట్ ఇండియా ఎండి హరి కె. ప్రసాద్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయన ఒక ఉదాహరణ ఇస్తూ, ఇవిఎంలో మొదటి పేరు ఒక జాతీయ పార్టీది అవుతుందని, ఆతరురవాత రాష్ట్రానికి చెందిన రిజిస్టర్డ్ పార్టీదని, గుర్తింపు పొందిన ఇతర పార్టీలవి ఆతరువాత స్థానాలని చెప్పారు. ఈ మెషీన్లపై అభ్యర్థుల పేర్లను పొందుపరిచేటప్పడు టెక్నీషియన్లను పిలిపిస్తుంటారని, కాని అలా చేయకూడదని ఆయన అన్నారు.
టెక్నీషియన్ బ్యాటరీని అమర్చి వెళ్లిపోవలసి ఉంటుందని, కాని అలా జరగడం లేదని ఆయన చెప్పారు. పోలింగ్ కు ముందు మెషీన్లపై సున్నాను రిటర్నింగ్ అధికారి చూపిస్తుంటారని, కాని అది నిజంగా సున్నాయేనా, లేక ఏవైనా వోట్లు అప్పటికే పడ్డాయా అనేది ఎవరికీ తెలియదని హరిప్రసాద్ పేర్కొన్నారు.
ప్రత్యర్థి బలహీన అభ్యర్థి అయినప్పటికీ ఇవిఎంలలో అక్రమాల కారణంగానే తాము ఓడిపోయామని కాంగ్రెస్, ఎన్ సిపి, బిజెపి, శివసేన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు ఆరోపించారని ఆయన తెలిపారు. ఇవిఎంల అక్రమాల కారణంగా తాము ఓడిపోయామని భావిస్తున్న పరాజిత అభ్యర్థులు కొందరిని నెట్ ఇండియా తీసుకువచ్చింది.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అభ్యర్థి స్థానికేతరుడని, నియోజకవర్గంలో ఆయనకు బలమేమీ లేదని నాసిక్ పశ్చిమ నియోజకవర్గం ఎన్ సిపి అభ్యర్థి నానా మహలె చెప్పారు. 'నేను 15 ఏళ్లుగా కార్పొరేటర్ ను. నాకు బలం ఎక్కువ ఉన్నది. కాని స్థానికేతర అభ్యర్థి ఒకరు 46 శాతం వోట్లు పొంది 24 వేల వోట్ల తేడాతో నన్ను ఓడించారు. ఎన్ సిపితో పాటు బిజెపికి కూడా నియోజకవర్గంలో బలం ఉంది. కాని ఎంఎన్ఎస్ అభ్యర్థికి ఈ రెండు పార్టీల కన్నా ఎక్కువ వోట్లు వచ్చాయి' అని మహలె చెప్పారు.
Pages: 1 -2- News Posted: 7 November, 2009
|