బోర్డు తిప్పిన ఓజ్ కాలేజీలు మెల్బోర్న్ : విదేశీ విద్యార్థులకు తిరుగులేని గమ్యస్థానంగా ఆస్ట్రేలియాకు ఉన్న పేరుప్రతిష్ఠలకు శుక్రవారం విఘాతం కలిగింది. దివాలా తీసిన నాలుగు కాలేజీలు బిచాణా ఏత్తేశాయి. ఫలితంగా రెండు వేల మంది విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా తయారైంది. కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు, రెసిడెన్సీ వీసాల కోసం డబ్బులు వసూలు చేశాయని వార్తలు వచ్చిన తరువాత ఆస్ట్రేలియా (ఓజ్)లోని 13 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (12 బిలియన్ అమెరికన్ డాలర్ల) అంతర్జాతీయ విద్యా రంగం విమర్శలకు గురైంది. ఆయిల్, బొగ్గు తరువాత విద్యా రంగం ద్వారానే ఆస్ట్రేలియాకు అధికంగా విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నది.
ఈ విషయం ఆస్ట్రేలియాను దౌత్యపరంగా ఇరకాటంలోకి నెట్టింది. భారతీయ విద్యార్థుల పట్ల ఆస్ట్రేలియాలో వ్యవహరిస్తున్న తీరుకు భారతీయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థులలో అత్యధిక సంఖ్యాకులు భారతీయులే. ఈ సంవత్సరం మొదట్లో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జరిగిన దాడులకు భారతదేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనితో ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్ భారత ప్రధానికి ఫోన్ చేసి భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించగలమని హామీ ఇవ్వవలసి వచ్చింది.
సిడ్నీ, మెల్బోర్న్ లలో నాలుగు ప్రైవేట్ కాలేజీలపై ఆధ్వర్యం వహించే గ్లోబల్ కాంపస్ మేనేజ్ మెంట్ గ్రూప్ ను గురువారం వాలంటరీ పాలనా యంత్రాంగం పరం చేశారు. బాధిత విద్యార్థులలో సుమారు 300 మంది భారతీయులని ఆస్ట్రేలియాలోని భారత డిప్యూటీ హైకమిషనర్ వి.కె. శర్మ తెలియజేశారు. ఇటీవల కొన్ని కళాశాలలు ఆర్థికంగా దివాలా తీయడం వల్ల ఇండియా నుంచి విద్యార్థుల రావడం తగ్గిందని ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 7 November, 2009
|