పెళ్ళా? మండపాల్లేవ్! హైదరాబాద్ : పెళ్ళి కళ వచ్చేసిందే బాలా... అని ఆనందంగా పాడుకోడానికి లేదు. 'పెళ్ళంటే నూరేళ్ళ పంట. అది పండాలి కోరుకున్న వారి ఇంట' అని కన్నెపిల్లలు కలలు కనడం రివాజు. 'పెళ్ళి చేసుకొని, ఇల్లు కట్టుకొని ఎల్లరు సుఖముగా ఉండాలోయ్' అని మగమహారాజులు తలపుల్లో విహరించడం కూడా తెలిసిందే. 'పెళ్ళంటే తప్పట్లు.. తాళాలు..బాజాలు, భజంత్రీలు. మూడే ముళ్ళు - ఏడే అడుగులు' అంటూ వివాహ వేడుకల ఆనందాన్ని అనుభవించాలంటే కాస్త ముందూ వెనుకా చూసుకోవాలి. లేకపోతే, 'మాయదారి చిన్నోడు - నా మనసే లాగేసిండు. లగ్గమెప్పుడ్రా మామా అంటే... మాఘమాసం వెళ్ళేదాకా మంచిరోజే లేదన్నాడు. ఆగేదెట్టాగా! అందాక వేగేదెట్టాగా' అని అంటే ఆగుతావో, వేగుతావో నాకు తెలీదు కాని కళ్యాణ మండపాలు దొరికే వరకూ పెళ్ళీ లేదు గిళ్ళీ లేదని తండ్రి తాడంత ఎత్తు ఎగిరి పడటం మాత్రం ఖాయం.
ఇది ముహూర్తాల కాలమే కదా... అన్నా... కుదరదు! వధువుకు వరుడు, వరుడుకి వధువు నచ్చినా! ఉభయపక్షాల పెద్దలకు ఇచ్చిపుచ్చుకునే లాంఛనాలు కుదిరినా సరే... మంచి ముహూర్తం చూసి పెళ్ళి చేసుకుంటామంటే కుదరదు. అదీ హైదరాబాద్ లో అయితే సమస్యే లేదు! శుభకార్యానికి అందరూ సిద్ధమైనా వేదిక.. అదేనండీ.. కళ్యాణవేదిక లేదా మండపం దొరకాలిగా. హైదరాబాద్ లో ఈనెల (నవంబర్) మొదలు కొని వచ్చే ఏడాది (2010) ఫిబ్రవరి వరకు ఒక్క కళ్యాణ మండపం ఒక్కటి కూడా ఖాళీగా లేదంటే నమ్మండి. అన్ని కళ్యాణమండపాలు ముందస్తుగానే రిజర్వ్ చేసుకున్నారు.
శుభకార్యాలు కుదుర్చుకోవడానికి 'నిదానమే ప్రదానం'. కానీ, వేదికలను బుక్ చేసుకోవడానికి మాత్రం 'ఆలస్యం అమృతం విషం' లాగుంది. అసలే హైదరాబాద్ లో జనం ఇసుకవేస్తే రాలని విధంగా పెరిగారు. వేదికలు ఆ స్థాయిలో పెరగని కారణంగా కళ్యాణమండపాలకు లేదా ఫంక్షన్ హాళ్ళకు గిరాకీ పెరిగింది.
Pages: 1 -2- News Posted: 10 November, 2009
|