గూగుల్ తో 'కోడా' డీకోడ్ రాంచి : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కేసు దర్యాప్తులో ప్రముఖ సెర్చి ఇంజన్ గూగుల్ సంస్థ సహాయాన్ని కోరామని ఆదాయపు పన్ను శాఖ(ఐటి) అధికారి వెల్లడించారు. అమెరికాకు చెందిన గూగుల్ ఆధ్వర్యంలోని జీమెయిల్ సర్వీసెస్ ద్వారా మధు కోడా, అతని సహచరులు విదేశాలలో నడిపిన ఆర్ధిక పెట్టుబడులకు సంబంధించిన వ్యవహాల గుట్లుమట్లు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. 'దర్యాప్తులో వివిధ సంస్థల సాయాన్ని మేము తీసుకుంటున్నాం. ఇది ఇందులో భాగమే' అని ఐటి శాఖలో దర్యాప్తు విభాగం అదనపు డైరెక్టర్ అజిత్ శ్రీవాత్సవ్ తెలియజేశారు.
మధు కోడాకు చెందిన లాప్ టాప్ లను, కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దీనిలో వివిధ దేశాలకు చెందిన వ్యక్తులతో, సంస్థలతో మార్పిడి చేసుకున్నఈ- మెయిల్స్ వీటిలో ఉన్నాయన్నారు. ఇవి విదేశీ లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించినవిగా తెలుసుకున్నామని ఐటి వర్గాలు చెప్పాయి. దాడులు జరిగినప్పుడు సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యే విధంగా హార్డ్ డిస్క్ లను కొందరు ఫార్మాట్ చేసినప్పటికీ అలా తొలగించిన ఫైళ్ళ పునరుద్ధరణకు ఐటి శాఖ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ లేబరేటరీల సాయాన్ని కూడా ఐటి శాఖ అర్థించింది. 'దాడులు జరిగిన భవనాలు, విదేశాలలో పెట్టుబడులు పెట్టిన లేదా అక్కడికి డబ్బు పంపిన వ్యక్తుల మధ్య మార్పిడి జరిగిన మెయిల్స్ వివరాలు మాకు అవసరం. మెయిల్ వివరాల ప్రింటౌట్ల వల్ల దర్యాప్తులో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ వివరాలను సేకరించడానికే గూగుల్ సాయం తీసుకుంటున్నాం' అని ఐటి శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 10 November, 2009
|