'సెల్లు' చెవులకు చిల్లు హైదరాబాద్ : 'పుస్తకం హస్తభూషణం' అన్నది పాత సామెత. 'సెల్ ఫోన్' నేటి హస్త బంధనంగా మారిందన్నది జగమెరిగిన సత్యం. సెల్ అంటూ ఉన్నాక 'రింగ్ రింగ్' మంటూ దూరతీరాల నుంచి 'కాల్స్' పోలోమంటూ వస్తాయి. ఇందులో అవసరం కొంతే... మిగిలిందంతా పిచ్చాపాటీ.. సెల్ 'లైన్' అంటూ కలిశాక మీరు విడిపోదామన్నా... అవతలివారు మిమ్మల్ని 'సొ(సె)ల్లు'తో చంపేయవచ్చు! 'వినదగు నెవ్వరు' అన్న పద్యం గుర్తుకొచ్చి, 'ఆలకించడం' మంచిదే అనుకుంటూ సెల్ ఫోన్ కు చెవులు అప్పగించారా? ఇక పై మీ వినికిడి శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెల్ ఫోన్ లో మాట్లాడితే చెవులు పోతాయా? ఎకసెక్కాలాడకండి అనేరు సుమా! ఇది డాక్టరు బాబుల స్టెతస్కోపుల సాక్షిగా నిజం. ఇటీవల హైదరాబాద్ లో 'ఈ ఎన్ టీ' వైద్యనిపుణుల వద్దకు 'శ్రవణ శక్తి'కి సంబంధించిన కేసులు రావడం పెరిగిపోయిందట. సెల్ ఫోన్ ఉందికదా అని అస్తమానం ఉపయోగించే వారికే ఎక్కువగా చెవి సంబంధ సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇందుకోసం 'సొ(సె)ల్లు' మానేసి, 'ల్యాండ్ లైన్ ఫోన్' లను వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
వైద్యనిపుణుడు రాంబాబు మాట్లాడుతూ, చెవి పరమైన సమస్యలతో చికిత్సకు వచ్చేవారి సంఖ్య పెరిగిందన్నారు. వీరిలో ఎక్కువమంది రోజుకి 3 నుంచి 4 గంటలు సెల్ 'కబుర్లు' చెప్పేవారని తెలిపారు. ఎక్కువగా సెల్ వాడకంతో రేడియేషన్ ప్రభావం కనిపిస్తోందన్నారు. అదే పనిగా సెల్ వినియోగంలో చెవుల్లో మోత, తలనొప్పి, విసుగు, కోపం వంటి లక్షణాలతో వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 11 November, 2009
|