బామ్మ బాటలో రాహుల్ న్యూఢిల్లీ : ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో సంప్రదాయానికి భిన్నంగా జరిగింది ఏదైనా ఉంటే అది కచ్చితంగా ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో రాజ్ బబ్బర్ కు మద్దతుగా రాహుల్ గాంధి ప్రచారం చేయడమే. ఉప ఎన్నికలలో పోటీ సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటుంది. పైగా సదరు రాష్ట్రంలోని అధికార పార్టీకే మొగ్గు ఉంటుంటుంది. అందువల్ల ప్రముఖ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటుంటారు. అలా కాకుండా అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి రాహుల్ గాంధి స్వయంగా ప్రచారానికి పూనుకోవడం పరిశీలకులను, కాంగ్రెస్ వాదులను విస్మయపరిచింది. దీనితో ఉప ఎన్నికలలో ఇందిరా గాంధి ప్రచారం సాగించిన 1977 రోజులను కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
సంప్రదాయానికి విరుద్ధంగా ప్రధాని పదవికి కాంగ్రెస్ వారసుడు వ్యవహరించడం పార్టీకి లాభదాయకం అయింది. ఇది పార్టీకి విజయాన్నిచేకూర్చింది. సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ ను ఆయన కోటలోనే దెబ్బ తీయడానికి లేదా లోక్ సభలో సంఖ్యాబలానికి అదనంగా ఒకటి కలవడానికి మించిన ప్రాముఖ్యం ఉందన పలువురు భావిస్తున్నారు. వోటు సాధకునిగా పేరు గడించడం బోనసే.
ఫిరోజాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే సమాచారం ప్రాతిపదికతోనే ఎన్నికల ప్రచారంలోకి దిగాలని రాహుల్ నిశ్చయించారని పార్టీ వ్యూహకర్తలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తే ఎస్ పికి నష్టం కలిగించడానికి, రాష్ట్రంలో అధికార బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)కి ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ను నిలబెట్టడానికి అవకాశం లభిస్తుందని భావించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభ్యర్థనను ఎఐసిసి యువ ప్రధాన కార్యదర్శి మన్నించి ఫిరోజాబాద్ వెళ్ళారు. ఒకవేళ రిస్క్ ఏదైనా ఉన్నప్పటికీ అందుకు కూడా సిద్ధపడాలని అనుకున్నారు. కాని చివర్లో పార్టీని గెలిపించి ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
రాహుల్ గాంధి ప్రచారకునిగా, వ్యూహకర్తగా, ఎన్నికల పోరులో గెలిపించగల నేతగా రాటుదేలుతున్నారని పరిశీలకుల భావన. యువతకే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆయన సిద్ధాంతం లోక్ సభ ఎన్నికలలో సత్ఫలితాలను సాధించింది. ఆయన వ్యూహం ముందు ఎల్.కె. అద్వానీ అభ్యర్థిత్వం ఎందుకూ కొరగాకుండా పోయింది.
Pages: 1 -2- News Posted: 11 November, 2009
|