బిజెపిలో 'గడ్కారీ' గోల న్యూఢిల్లీ : ఎంత లేదని చెప్పినా భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై సంఘ్ పట్టు నానాటికి బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. బిజేపీ నాయకత్వంలో చేయవలసిన మార్పులపై పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహనరావు భాగవత్ తో చర్చలు జరిపారు. బిజెపి అగ్ర నేతలతో ఆర్ఎస్ఎస్ నేతల సంప్రదింపుల ప్రక్రియ రెండు వారాల క్రితం మొదలైంది. భాగవత్ ముందు ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీతో సంప్రదింపులు జరిపారు. జనవరిలో పార్టీ కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించడానికి వీలుగా రాజనాథ్ పదవిలో నుంచి నిష్క్రమించిన అనంతరం లోక్ సభలో ప్రతిపక్ష నాయకుని పదవికి అద్వానీ రాజీనామా చేయగలరని భావిస్తున్నారు.
మహారాష్ట్ర శాసన మండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు నితిన్ గడ్కారిని పార్టీకి కొత్త అధ్యక్షుని ఎంపిక చేయాలని భాగవత్ 'దాదాపుగా' నిర్ణయం తీసుకున్నట్లు సంఘ్, బిజెపి వర్గాలు తెలియజేశాయి. అయితే, హిందీ భాష మాట్లాడే ప్రధాన ప్రాంతాలకు చెందని దాదాపు అనామకుడి వంటి గడ్కారికి పార్టీ పదవీ బాధ్యతలు అప్పగించడంపై పార్టీలో కొన్నివర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గడ్కారికి 'మహారాష్ట్రలో వర్గాలను సృష్టించడం మినహా రాజకీయ చాతుర్యం గాని, ప్రావీణ్యం గాని ఉన్నట్లు రుజువు కాలేదు' అని మహారాష్ట్రకు చెందిన పార్టీ ఎంపి ఒకరు చెప్పారు. 'ఆయన ఏకైక యోగ్యత ఏమిటంటే ఆయన నాగపూర్ (ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం) వాసి కావడం, సంఘ్ తో సదా సత్సంబంధాలు కలిగి ఉండడం' అని ఒక ప్రతినిధి వ్యాఖ్యానించారు.
స్వర్గీయ ప్రమోద్ మహాజన్ మహారాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించడం ఆర్ఎస్ఎస్ ను వ్యాకులపరిచినప్పుడు ఆయనకు పోటీగా గడ్కారిని సంఘ్ పైకి తీసుకువచ్చింది. మహాజన మరణానంతరం గడ్కారికి సంఘ్ అండగా నిలచింది. అయితే, ప్రమోద్ మహాజన్ బావమరిది గోపీనాథ్ ముండే క్రమంగా ప్రాబల్యం సాధించి గడ్కారిని వెనుకకు నెట్టారు. ఆర్ఎస్ఎస్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం భాగవత్ తన ఏకైక 'లక్ష్యం, అజెండా' బిజెపిని 'అదుపులోకి తెచ్చుకోవడం' అని ప్రకటించారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇది సాధించడానికి భాగవత్ కు పరోక్ష నాయకుడు ఒకరు కావలసి ఉంటుందని, 'సదరు నాయకుడే గడ్కారి కావచ్చు' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, అసలు సంఘ్ లో కూడా గడ్కారి అభ్యర్థిత్వం పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదు. భాగవత్ తరువాత స్థానంలో ఉన్న సురేష్ సోని పార్టీ తదుపరి అధ్యక్షుడు ఢిల్లీకి చెందిన నేత అయి ఉండాలని పట్టుబట్టుతున్నారు. అంటే అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఎం. వెంకయ్య నాయుడులలో ఒకరు పార్టీ అధ్యక్షుడు కావాలనేది సురేష్ సోని ఆంతర్యం. భాగవత్ బుధవారం రాజనాథ్ ను కలుసుకుని సుమారు రెండు గంటల సేపు చర్చలు జరిపిన సోని కూడా ఆయన వెంట ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 12 November, 2009
|