హిజ్రాలకు 'ఒ' గుర్తింపు న్యూఢిల్లీ: పురుషుడు, మహిళ, 'ఒ'. ఎన్నికల కమిషన్ పదజాలంలో జెండర్ కాలంలో 'ఇతరం' అనే పదం చోటుచేసుకున్నది. తృతీయ జాతి వ్యక్తులు (హిజ్రాలు), సెక్స్ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు ఓటర్ల జాబితాలలో తమను ఇకమీదట పురుషునిగా లేదా మహిళగా వర్గీకరించుకోవలసిన అవసరం ఉండదని ఎన్నికల కమిషన్ (ఇసి) సూచించింది. వారు తమ పేర్ల నమోదు సమయంలో తమ సెక్స్ ను 'ఇతరం' (ఒ)గా పేర్కొనవచ్చునని కమిషన్ గురువారం న్యూఢిల్లీలో ఒక పత్రికా ప్రకటనలో సూచించింది.
ఎన్నికలలో పోటీ చేయాలని అభిలషించే హిజ్రాలు కమిషన్ అధికారులకు తాము అందజేసిన ప్రకటనలను బట్టి తమను పురుషునిగా లేదా మహిళగా ఇప్పటి వరకు నమోదు చేయించుకోవలసి వస్తున్నది. కాని వివిధ వర్గాల నుంచి కమిషన్ కు అభ్యర్థనలు, రాయబారాలు వస్తున్నాయి. 'కమిషన్ ఆ అభ్యర్థనలను పరిశీలించి, హిజ్రాలను, సెక్స్ మార్పిడి చేయించుకున్నవారు పురుషునిగా లేదా మహిళగా తమను వర్గీకరించుకోవడం ఇష్టం లేకపోయినట్లయితే, వారిని తమ సెక్స్ ను 'ఇతరం' అని సూచించేందుకు అనుమతించాలని నిర్ణయించింది' అని ఆ పత్రికా ప్రకటన వివరించింది.
కమిషన్ ఉపయోగించే అన్ని ఫారాలలో సెక్స్ ను సూచించేందుకు 'ఒ' అనే క్లాజు ఉంటుంది. ఐటి ఆధారిత ఫార్మాట్లు, వెబ్ సైట్ తో సహా అన్నిచోట్లా ఈ క్లాజు ఉంటుంది. ఇంటింటికీ తిరిగి పేర్లు నమోదు చేసుకుంటున్నప్పుడు లేదా ఏదైనా దరఖాస్తును నిర్థారిస్తున్నప్పుడు హిజ్రాలు లేదా సెక్స్ మార్పిడి చేయించుకున్నవారు అభిలషించినట్లయితే 'ఒ' అని వారి సెక్స్ ను సూచించవలసిందిగా ఎన్యూమరేటర్లను, బూత్ స్థాయి ఆఫీసర్లను ఆదేశించగలమని కమిషన్ తెలియజేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల (సిఇఒల) ద్వారా ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారులందరికీ తగిన విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ తెలియజేసింది.
Pages: 1 -2- News Posted: 13 November, 2009
|