కలిసొచ్చిన కరవు శ్రీనగర్ : దుర్భిక్షం ధర్మమా అని కాశ్మీర్ రాష్ట్రంలో ఏపిల్ రైతులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని దండిగానే పొందుతున్నారు. రాష్ట్రంలో ఏపిల్ ఉత్పత్తి తగ్గింది. కాని రికార్డు స్థాయి ధరల ఫలితంగా రైతులు తక్కువ దిగుబడి వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకోగలగడమే కాకుండా అధికంగా లాభాలు ఆర్జిస్తున్నారు. అనావృష్టి వల్ల మరొక మేలు కూడా జరిగింది. బాదం ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. బాదం తోటకు పొడి వాతావరణం కావలసి ఉంటుంది.
'కాశ్మీర్ లో ఏపిల్ పండ్ల ఉత్పత్తి క్రితం సంవత్సరం రమారమి 14 లక్షల టన్నుల మేర ఉన్నది. ఈసారి 15 శాతం నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి తగ్గింది' అని రాష్ట్ర ప్రభుత్వ తోటల శాఖ డైరెక్టర్ జి.హెచ్. షా తెలియజేశారు. అయితే, అనావృష్టి వల్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు సగటున 40 శాతం మేర పెరిగాయి. పండ్ల రైతులు నిరుడు రూ. 2200 కోట్లు ఆర్జించగా ఈ సంవత్సరం రూ. 2500 కోట్ల మేరకు ఆర్జించవచ్చునని షా పేర్కొన్నారు.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తిలో ఏపిల్ వాటా 90 శాతం పైగా ఉంటుంది. మిగిలినవాటిలో బేరి పండ్లు, చెర్రీ, ద్రాక్ష, ఏప్రికాట్ లు, పీచ్ ఉన్నాయి. 'అనావృష్టి వల్ల కాండి ప్రాంతాల (ఎగువ ప్రదేశాలు లేదా గుట్టలు)లో ఉత్పత్తి తగ్గింది.అవి వర్షాధార ప్రాంతాలు. మైదాన ప్రాంతాలలో ఈ ప్రభావం అంతగా లేదు. ఎందుకంటే వీటికి నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి' అని షా వివరించారు. కుప్వారాలోను, కొన్ని ఇతర ప్రదేశాలలో వడగళ్ళ వాన వల్ల పంటలు దెబ్బ తిన్నాయి.
Pages: 1 -2- News Posted: 14 November, 2009
|