యుఐడి ప్రాజెక్ట్ లీకేజి? బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక గుర్తింపు (యుఐడి) నంబర్ ప్రాజెక్ట్ వివరాలు ఉన్న ఒక రహస్య ఫైల్ ను తాను ప్రచురించినట్లు ఒక వెబ్ సైట్ ప్రకటించుకున్నది. అజ్ఞాత సమాచారం ప్రచురణకు, ప్రభుత్వ, కార్పొరేట్ లేదా మతపరమైన పత్రాల లీక్ లకు పేరొందిన వెబ్ సైట్ 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.వికీలీక్స్ డాట్ ఆర్గ్' (www.wikileaks.org) శుక్రవారం '1.2 బిలియన్ల ఐడి కార్డులు : ఇండియాలో ప్రతి నివాసి కోసం ప్రత్యేక ఐడి సృష్టి' అనే శీర్షికతో ఒక పైల్ ను ప్రచురించింది.
ఈ ప్రాజెక్టుపై సమాచారాన్ని కోరుతూ ఆర్ టిఐ కార్యకర్తలు భారత ప్రత్యేక గుర్తింపు నంబర్ ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ)తో పోరు సాగిస్తున్న సమయంలో ఈ వెబ్ సైట్ ఈ విషయం వెల్లడించింది. (ఈ ఫైల్ కాపీని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సంపాదించింది.) ఈ పైల్ 40 పేజీల డాక్యుమెంట్. పేర్ల నమోదు ప్రక్రియ, ఖర్చులు, అప్ డేట్ చేసే ప్రక్రియ, బయోమెట్రిక్స్, మరణాల నమోదు, యుఐడి నిర్థారణ మార్గాలు, యుఐడి సాంకేతిక అంశాలు, వంచన పద్ధతులు, సవాళ్ళతో సహా యుఐడి ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ విషయాలు ఈ పత్రంలో ఉన్నాయి.
యుఐడిఎఐ చైర్మన్ నందన్ నీలేకని బహిరంగ వేదికలలో చర్చిస్తున్న అంశాలు చాలా వరకు ఈ ఫైలులో ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే, ఈ ఫైల్, 'లీక్' ఎంత వరకు కచ్చితమైనవనేది ధ్రువీకరణ కాలేదు. 'వివిధ రిజిస్ట్రార్లు, రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టు పని సాగుతుండగా దేశ వ్యాప్తంగా పేర్ల నమోదు పద్ధతుల పరిశీలనకు జిఐఎస్ ఇంటర్నెట్ ఆధారిత విజ్యువల్ రిపోర్టింగ్ వ్యవస్థను యుఐడిఎఐ ఉపయోగించగలదు' అని ఈ డాక్యుమెంట్ పేర్కొంటున్నది.
Pages: 1 -2- News Posted: 16 November, 2009
|