'అప్పీల్'పై చార్జీల మోత న్యూఢిల్లీ : కోర్టు ఫీజులను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఎప్పుడో నిర్ణయించిన ఫీజలను కనీసం ఇరవై రెట్లు పెంచాలన్నది ఆలోచన. ఇది అమలు లోకి వస్తే ఇక కోర్టుల్లో కేసులు వేయడానికి కూడా భారీగా నగదు చెల్లించవలసి రావచ్చు. కక్షిదారులు, న్యాయవాదులు 40 సంవత్సరాలకు పైగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో అప్పీళ్ళు లేదా వకాలత్ నామా దాఖలు చేయడానికి నామమాత్రపు ఫీజు చెల్లిస్తున్నారు. అయితే, కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆ ఫీజు 20 రెట్లు పెరగవచ్చు.
కోర్టు పీజు విషయమై పునఃపరిశీలించి, ఏకీకృత కేంద్ర కోర్టు ఫీజు చట్టం రూపకల్పనకు మొయిలీ శ్రీకారం చుట్టిన ప్రక్రియలో భాగమే ఈ ప్రతిపాదన. సుప్రీం కోర్టు విషయంలోను, కేంద్ర శాసనాల ప్రకారం ఏర్పాటు చేసిన అన్ని ట్రిబ్యునళ్ళ విషయంలోను వాస్తవిక ఫీజులు చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించనున్నారు. ఈ ప్రతిపాదనపై న్యాయవాదుల సంఘాలతో మొయిలీ చర్చలు ప్రారంభించవచ్చు.
ఏదైనా హైకోర్టు (హెచ్ సి) తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్ పి)ని దాఖలు చేయడానికి ఫీజును 1966లో రూ. 250గా నిర్థారించారు. అది గడచిన 43 ఏళ్ళుగా కొనసాగుతోంది. ఎస్ఎల్ పి దాఖలు నిమిత్తం ఢిల్లీకి ప్రయాణించే కక్షిదారులలో చాలా మంది ప్రయాణ ఖర్చుల కింద అంతకన్నా ఎక్కువ మొత్తాన్నే వెచ్చిస్తుంటారు. ఇక దేశ రాజధానిలో బస కోసం పెట్టే ఖర్చు సంగతి సరేసరి.
కక్షిదారుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తుండే న్యాయవాదులు ఎస్ఎల్ పిలో వకాలత్ నామా దాఖలు చేయడానికి అత్యంత స్వల్ప మొత్తం రూ. 3 మాత్రమే చెల్లిస్తుంటారు. కేసులో హాజరు కావడానికి తమను అనుమతించేందుకు క్లయంట్ నుంచి పొందే అధికార పత్రం వకాలత్ నామా. అంతే కాదు కేసులో హాజరు కావడానికి న్యాయవాదులు రూ. 5 మాత్రమే చెల్లిస్తుంటారు.
Pages: 1 -2- News Posted: 17 November, 2009
|