పైలట్లకూ ఇక మందు పరీక్ష న్యూఢిల్లీ : మద్యం నిషాలో విమానాలు నడిపేందుకు వచ్చే పైలట్లు తేలికపాటి శిక్షలతో సరిపెట్టుకునే రోజులు గతిస్తున్నాయి. 'మందు' మత్తులో విధులకు వచ్చే పైలట్ లైసెన్స్ ను అమెరికాలో వలె ఇండియా కూడా రద్దు చేయాలని కోరుతూ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ)కి అనేక వర్గాల నుంచి వినతిపత్రాలు అందాయి. 'మందు' కొట్టిన పైలట్ లైసెన్స్ ను రద్దు చేయాలని కోరినవారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విమానయాన ఔత్సాహికుడు విజయ్ పత్ సింఘానియా కూడా ఉన్నారు. ఇటీవల ఎటిసి గిల్డ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింఘానియా ఈ విజ్ఞప్తి చేశారు.
'ఈ విషయమై కరాఖండిగా వ్యవహరించడమనేది మా విధానం. అన్ని విధాల కఠిన చర్యల గురించి మేము యోచిస్తున్నాం. ఇప్పుడున్న చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నాం. పైలట్లకు ప్రయాణానికి ముందు శ్వాస పరీక్ష నిర్వహించబోతున్నాం' అని డిజిసిఎ అధిపతి నసీమ్ జైదీ తెలియజేశారు. డిజిసిఎ సరికొత్త నిబంధనావళిని త్వరలో ప్రవేశపెట్టబోతున్నది. ఈ నిబంధనావళి కింద వివిఐపి విమానం సిబ్బందికి కూడా శ్వాస పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష చేయించుకోవలసిన కమర్షియల్ విమాన సర్వీసుల సిబ్బంది శాతాన్ని క్రమంగా పెంచనున్నారు.
'ఈ పరీక్షలు నిర్వహించవలసిన బాధ్యత విమాన సంస్థపైనే ఉంటుంది. అయితే, 100 శాతం పరీక్షలు నిర్వహించడానికి తగిన సదుపాయాలు ఎక్కువగా ఉండాలి కనుక క్రమంగా మేము ఆ దిశగా పురోగమిస్తాం' అని సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. పైలట్లు తాము విమానం నడపడానికి 12 గంటల ముందు మద్యం సేవించకుండా నిరోధించడానికి కఠినమైన జరిమానాలను విధించాలని డిజిసిఎ అనుకుంటున్నందున మద్యం సేవించే పైలట్లు ఇక చిక్కుల్లో పడనున్నారు.
Pages: 1 -2- News Posted: 17 November, 2009
|