రామారావుకు కొత్త ఝలక్ హైదరాబాద్ : తన నర్సింగ్ కళాశాలలో విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణపై ఈ సంవత్సరం జూలైలో అరెస్టయిన కొవ్వూరు టిడిపి ఎంఎల్ఎ టి.వి. రామారావుకు గురువారం మరొక దెబ్బ తగిలింది. నర్సింగ్ కళాశాలకు ఇచ్చిన అనుమతిని ఎందుకు రద్దు చేయరాదో కారణాలు వివరించవలసిందని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాశాల యాజమాన్యానికి గురువారం సంజాయిషీ నోటీస్ జారీ చేసింది.
దర్యాప్తు కమిటీ కళాశాలలో లోపాలను పేర్కొన్న దృష్ట్యాను, నిడదవోలులో స్పృహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో సొంత ఆసుపత్రి ఉందనే తప్పుడు ప్రకటనతో కళాశాలకు అనుమతి సంపాదించిన దృష్ట్యాను స్పృహ కాలేజీ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యానికి ఇచ్చిన అనుమతిని ఎందుకు రద్దు చేయరాదో వివరించవలసిందంటూ రామారావు ఆధ్వర్యంలోని స్పృహ ఎడ్యుకేషనల్ సొసైటీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి జె. సత్యనారాయణ నోటీస్ జారీ చేశారు.
తమ సంస్థకు సొంతంగా 200 పడకల ఆసుపత్రి ఉందని కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలో దరఖాస్తుదారు తెలియజేశారు. (సంబంధిత నోటిఫికేషన్ ప్రకారం బిఎస్ సి కాలేజీ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుకు అనుమతి కోసం 200 పడకల ఆసుపత్రి ఉన్న సంస్థలు మాత్రమే దరఖాస్తు చేయాలి.)
Pages: 1 -2- News Posted: 20 November, 2009
|