ఏటా మిలియన్ పిల్లలు మృతి న్యూఢిల్లీ : శిశు హక్కుల ఒప్పందం (సిఆర్ సి)పై ఇండియా సంతకం చేసి దాదాపు 20 సంవత్సరాలు గడచిన తరువాత కూడా శిశువుల మనుగడ, వికాసం విషయాలకు సంబంధించి ఆశించిన ఫలితాలు పూర్తిగా సిద్ధించలేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఐదేళ్ళ వయస్సు వచ్చే లోపే మరణించే పిల్లల సంఖ్య తగ్గడం, పాఠశాలలలో బాలికల హాజరు శాతం పెరగడం వంటి అంశాలు హర్షం కలిగిస్తుండగా దేశంలో పిల్లల సంఖ్య అత్యధికంగా ఉన్న కారణంగా ముందున్న సవాళ్ళు కూడా జటిలమైనవేనని అభిప్రాయం నెలకొన్నది.
ప్రపంచంలోని పిల్లలలో ఐదింట ఒక వంతు మంది ఇండియాలో ఉన్నారు. ఏ కారణంగానైనా ఇండియాలో పిల్లల హక్కుల హరించడం కూడా గణనీయ స్థాయిలోనే జరుగుతున్నది. 'ప్రతి సంవత్సరం పది లక్షల మంది నవజాత శిశువులు మొదటి నెల తిరిగే లోగానే కన్ను మూస్తున్నారు. మరో పది లక్షల మంది ఐదేళ్ళ వయస్సు వచ్చే లోపు మరణిస్తున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలు దాదాపు 55 మిలియన్ల మంది ఉండవలసిన స్థాయి కన్నా తక్కువ బరువుతో ఉంటున్నారు. అనేక సవాళ్ళు అలాగే ఉన్నాయి' అని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి కారిన్ హల్షాఫ్ శుక్రవారం న్యూఢిల్లీలో 'ప్రపంచ బాలల స్థితి' నివేదిక ప్రత్యేక ప్రతిని విడుదల చేస్తూ చెప్పారు. పద్దెనిమిదేళ్ల లోపు యువతులు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కనడం, వారి అనారోగ్య సమస్యలే చిన్నారుల మరణాలకు అత్యధికంగా కారణం అవుతున్నాయని హల్షాఫ్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 21 November, 2009
|