ఊపిరాడని 'గాలి' హైదరాబాద్ : రెండు రోజుల క్రితం వరకూ రెండు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన 'గాలి' సోదరులకు ఇప్పుడు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రికే కంటి మీద కునుకులేకుండా చేసిన ఈ అపూర్వ సహోదరులకు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారం నిద్రకు దూరం చేస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ(సిడబ్ల్యుసి) సమర్పించిన నివేదక గాలి జనార్ధన్ రెడ్డి సోదరులను ఇరుకున పెట్టింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బిజెపి మంత్రులుగా ఉన్న గాలి సోదరులపై యుద్ధం చేస్తోంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రతిపక్షపార్టీలు కూడా సమరం సాగిస్తున్నారు. కాంగ్రెస్ లోని సీనియర్ల నాయకులు కూడా గాలి సోదరులపై నిప్పులు చెరుగుతున్నారు. ముప్పేట దాడి ఒక్కసారిగా ముంచుకురావడంతో గాలి సోదరులు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక సతమతమవుతున్నారు.
ఓఎంసి అక్రమాలపై ముఖ్యమంత్రి రోశ య్య చర్యలు తీసుకోలేకపోతున్నారని, మైనింగ్ మాఫియాకు ఆయన భయపడుతున్నారన్న విమర్శనాస్త్రాలతో సర్కారును చర్యల దిశగా నడిపించాలన్న వ్యూహంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాజకీయపరమైన ఒత్తిడికి శ్రీకారం చుట్టారు. వామపక్షాలతో పాటు, లోక్‌సత్తాతో కలసి టిడిపి గత కొద్దిరోజుల నుంచి ఆందోళనను ఉధృతం చేస్తోంది. పీఆర్పీ వీరితో కలసిరాకపోయినప్పటికీ ఓఎంసిపై విడిగానే పోరాడుతోంది. ఆ పార్టీ కూడా సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది. ఈరకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఓఎంసిని చక్రబంధంలో ఇరికించేందుకు విపక్షాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ప్రతిపక్షాల దాడితో సతమతమవుతున్న నేపథ్యంలో నగరానికి వచ్చిన గాలి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై ఎదురుదాడి చేయడం అందరినీ ఆకర్షించింది.
ఆ వెంటనే జగన్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎంపి హర్షకుమార్ కూడా ఓఎంసి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాం డ్ చేశారు. ఈ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య సిబిఐ విచారణకు ఆదేశిం చడం ఓఎంసి వ్యవహారం మరింత ఉడికింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ కూడా ఓఎంసి అక్రమాలను నిర్ధారించింది. ఆంధ్ర-కర్నాటక రాష్ట్రాలకు చెందిన అధికారులతో కమిటీ వేసి, ఓఎంసిలో అక్రమాలు నిజమేనని తేలితే లీజును రద్దు చేయాలని సిఫార్సు చేయడంతో, గాలి యజమానిగా ఉన్న ఓఎంసికి తేరుకోలేని దెబ్బ తగిలినట్టయింది. పులిమీద పుట్రలా.. ఉన్న సమస్యలకు తోడు వి.హన్మంతరావు తాజాగా సంధించిన విమర్శనాస్త్రాలు ఓఎంసిని మరిన్ని సమస్యల వలయంలోకి నెట్టివేశాయి. గాలికి దన్నుదారులుగా ఉన్న రాష్ర్ట కాంగ్రెస్ నేతలపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఆ గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు బదలాయించాలంటూ ప్రధానికి లేఖ రాస్తానని మరో బాంబు వేయడం బట్టి.. ఓఎంసి ఇకపై పూర్తిగా కష్టాల్లో ఇరుక్కోక తప్పదని స్పష్టమవుతోంది.
Pages: 1 -2- News Posted: 21 November, 2009
|