దొంగలకు ఇష్టం 'మారుతి' న్యూఢిల్లీ : మీకే కనుక లగ్జరీ కారు ఉన్నట్లయితే...నో ప్రోబ్లమ్.. మీరు చాలా హాయిగా నిద్ర పోవచ్చు. ఎందుకంటే దానిని దొంగా ఎత్తుకెళ్ళడు. మీది మారుతీ 800 బుల్లి కారా? వెయ్యి కళ్ళతో కాపాలా కాసుకోవలసిందే . దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న కార్ల దొంగతనాల్లో ప్రతి మూడు కార్లలో ఒకటి మారుతి 800 అని లెక్కలు తేలాయి. అంటే దేశంలోని సామాన్యల నుంచి అసామాన్యల వరకూ అత్యంత అభిమానపాత్రమైన మారుతి కారు చోర శిఖామణుల మానస చోరిణిగా మారిందన్నమాట.
ఢిల్లీ పోలీసులు తయారు చేసిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సంవత్సరం చోరీ అయిన కార్లలో 50 శాతం పైగా మారుతి సంస్థ ఉత్పత్తి చేసినవే. ఈ సంవత్సరం 3000 కార్లు అపహరణకు గురి కాగా వాటిలో 1700 మారుతి కార్లు ఉన్నాయి. మళ్ళీ వీటిలోను 650 కార్లు మారుతి 800లే. తిరిగి అమ్మాలంటే ఈ కారుకు ఎక్కువ ధరే పలుకుతుంటుండడం ఇందుకు కారణం. దీనికి పూర్తి విరుద్ధంగా లగ్జరీ కారైన హోండా సివిక్ లు 9 మాత్రమే చోరీ అయ్యాయి. పెద్దవి, ఖరీదైనవి అయిన కార్ల కన్నామారుతి కార్ల తలుపులను తేలికగా తెరిచి, నడుపుకుంటూ పోయి అమ్ముకోవచ్చునని పోలీసులు చెబుతున్నారు. 'లగ్జరీ కారును కొనడం సులభం. కాని చోరీ అయిన కారును అమ్మడం జటిలమే' అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
మరి మారుతి కారుపైనే ఎందుకంత అభిమానం అంటే రోడ్లపై తిరిగే కార్లలో అధిక సంఖ్యలో ఉండేవి మారుతివే. 'ప్రతి రెండవ కారు మారుతి 800. అందువల్ల దొంగ పట్టుబడే అవకాశాలు బహు స్వల్పం' అని ఆ అధికారి చెప్పారు. కాగా, ఈ సమస్య పరిష్కారానికి మారుతి సంస్థ చర్యలు తీసుకుంది. '2006 అక్టోబర్ తరువాత అన్ని కార్లకు ఐక్యాట్స్ సిస్టమ్ అమర్చాం. ఈ సిస్టమ్ వల్ల ఒరిజినల్ కీతో స్టార్ట్ చేయనట్లయితేనే కారు కదులుతుంది' అని మారుతి సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 23 November, 2009
|