సిబల్ మార్కులెన్నో మరి? న్యూఢిల్లీ : ఐఐటిలలో ప్రవేశానికి అర్హత మార్కులను (కటాఫ్ ను) పెంచాలన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ చేసిన సూచన హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖను ఇరకాటంలోకి నెట్టింది. విద్యార్ధులకు ఎడాపెడా సలహాలు ఇస్తూ, ప్రతిభ గురించి ఉపన్యాసాలు ఇస్తూ, అర్హతలు నిర్ణయిస్తున్న సిబల్ గారికి అసలు ఎన్ని మార్కులు వచ్చాయో బయట పెట్టాలంటూ డిమాండ్ వచ్చింది. ఎస్ఎస్ఎల్ సి పరీక్షలో మంత్రికి ఎన్ని మార్కులు వచ్చాయో వెల్లడి చేయవలసిందంటూ సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టం కింద వచ్చిన ఒక అసాధారణ ప్రశ్నకు హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ అధికారులు సమాధానం ఇవ్వవలసి వస్తున్నది.
సిబల్ కు ఆయన స్కూల్ చివరి సంవత్సరం పరీక్షలలో వచ్చిన మార్కులు తెలియజేయాలని వారణాసి వాసి రామ్ చరణ్ బహదూర్ ప్రభుత్వాన్ని కోరారు. హెచ్ఆర్ డి మంత్రి చేసినట్లుగా పేర్కొంటున్న వ్యాఖ్యలకు ఈవిధంగా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నట్లున్నది. ఆర్ టిఐ కింద తన స్కూలు మార్కులు వెల్లడి చేయవలసిన పరిస్థితి ఒక్క సిబల్ కే ఎదురుకావడం లేదు. ఐఐటి డైరెక్టర్లు, ఫ్యాకల్టీ అందరికీ వారి స్కూలు చివరి పరీక్షలలో వచ్చిన మార్కులు తెలియజేయాలని బహదూర్ కోరారు.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలోను, హార్వర్డ్ లా స్కూల్ లోను చదివిన సిబల్ దేశంలో అత్యుత్తత విద్యార్హతలు ఉన్న రాజకీయ నాయకులలో ఒకరు కావచ్చు. అయితే, ఐఐటిలకు అర్హతపై సిబల్ చేసిన వ్యాఖ్యలకు వివిధ వర్గాలలో వ్యక్తమైన ఆగ్రహానికి బహదూర్ ఆర్ టిఐ దరఖాస్తు ఒక సూచిక కావచ్చు. మంత్రి ఆతరువాత తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చుకున్నారు.
ఐఐటి కోచింగ్ క్లాసులపై కన్నా స్కూలుపైనే విద్యార్థులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించేట్లుగా ప్రోత్సహించేందుకు ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఐఐటి జెఇఇ)కి అర్హత కటాఫ్ ను పెంచితే బాగుంటుందేమో ఆలోచించాలని సిబల్ సూచించారు. స్కూలు చివరి పరీక్షల్లో 80 శాతాన్ని సవరించిన కటాఫ్ గా నిర్దేశించవచ్చునని సిబల్ ఉజ్జాయింపుగా సూచించారు. అంటే స్కూల్ చివరి పరీక్షల్లో మొదటి 20 శాతం స్థానాలు పొందినవారే ఐఐటి జెఇఇకి అర్హత పొందుతారన్నమాట. ప్రస్తుతం ఐఐటి జెఇఇకి అర్హత పొందడానికి విద్యార్థులు తమ స్కూలు చివరి పరీక్షలలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
Pages: 1 -2- News Posted: 23 November, 2009
|