'గూగుల్' గల్లంతు! రాయ్ చూర్ : నువ్వు 'గూగూల్' లో ఉండి గూగూల్ చూడలేవు. అదంతే. కంప్యూటర్ ముందు పెట్టుకుని ఎంత గింజుకున్నా, 'గూగుల్' లోనే కూర్చుని ఉన్నా గూగుల్ సెర్చి ఇంజన్ ను పట్టుకోలేవు. ప్రపంచంలోని సమస్త విషయాలను, ప్రదేశాలను క్షణాల్లో నీ కంప్యూటర్ లో సాక్షాత్కరింపచేసే గూగూల్ పప్పులు గూగుల్లో మాత్రం ఉడకవు. బెంగళూరుకు సుమారు 510 కిలోమీటర్ల దూరంలో రాయ్ చూర్ జిల్లాలో కృష్ణానదీ తీరాన ఉన్న చిన్న పల్లె అది. వెయ్యమంది నివసించే ఈ గ్రామానికి ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేదు మరి. కానీ ఈ గ్రామం పేరు మాత్రం 'గూగుల్'. ఇది నిజం.
ఎక్కడో అమెరికాలోని కాలిఫోర్నియా మౌంటెన్ వ్యూ కేంద్రంగా ఉన్న సెర్చ్ ఇంజన్ కంపెనీ ఈ పేరునే ఎలా పెట్టుకుందో ఆశ్చర్యమే. ఈ ఊరి పేరును ఇంగ్లీషులో ఎలా పలుకుతారో మీ ఇష్టం గానీ ఊరి బయట ఉన్న ఫలకంపై గానీ, ప్రభుత్వ రికార్డుల్లోగానీ, కన్నడ భాషలో ఈ ఊరును 'గూగుల్' అనే రాస్తారు. పలుకుతారు. ప్రభుత్వ అధికారులు ఈ గ్రామం బయట ఇంగ్లీషులో ఊరు పేరు బోర్డును పెట్టడానికి ప్రయత్నించారు. కానీ కొంతమంది ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 'కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఎవరైనా వచ్చి కన్నడ లిపిలో ఉన్న ఈ ఊరు పేరును చదవేలా చూడండని మేం అధికారులతో చెప్పాం' అంటూ నవ్వేస్తారు కన్నడ భాషాభిమాని కెపి యల్లయ్యనాయక.
సైబర్ ప్రపంచాన్ని యేలేస్తున్న ప్రముఖ సెర్చి ఇంజన్ పేరు తమ గ్రామం పేరు ఒకటేనని ఇప్పుడిప్పుడే కొద్ది మంది గ్రామస్థులకు తెలిసింది. 'గూగుల్ గురించి నా మనుమరాలు చెప్పింది. అమెరికాలో ఎవరో ఇద్దరు యువకులు తమ కంపెనీకి మన ఊరి పేరే పెట్టకున్నారని చెప్పినప్పుడు చాలా ఆనందం, గర్వం అనిపించింది' అని భూస్వామి బసవరాజప్ప గౌడ పోలీసు పాటిల్ చెప్పాడు. 'మన ఊరు పేరు సైబర్ ప్రపంచంలో మారుమోగిపోతుందంటే ఎవరు మాత్రం ఆనందించరు? ఇది కాకతాళీయమే అయినా ఆనందకరమైన సంగతి. తమ కంపెనీకి గూగుల్ అనే పేరు పెట్టడానికి అమెరికా యువకులకు వేరే కారణాలు ఉండవచ్చున'ని బళ్లారిలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త, గూగుల్ గ్రామస్థుడు శరణ గౌడ వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 27 November, 2009
|