అడవుల్ని పెంచిన నక్సల్స్! న్యూఢిల్లీ : శుభవార్త. దేశంలో అటవీ ప్రాంతాలు 2005, 2007 సంవత్సరాల మధ్య. 728 చదరపు కిలో మీటర్ల మేర వృద్ధి చెందాయి. స్మగ్లర్లు, మైనింగ్ మాఫియా డాన్ లు, వ్యవసాయం కోసం స్వార్ధపరులు ఇష్టం వచ్చినట్లు అడవులను అంతమొందిస్తుంటే ఈ వృద్ధి ఎలా సాధ్యమైందనేగా మీ సందేహం. నక్సలైట్ల కారణంగా. నిజంగా నిజం. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సామాజిక అడవులు, రక్షిత అడవులు అంటూ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పెరగని విస్తీర్ణం నక్సలైట్ల కారణంగా జరిగింది. ఎందుకంటే నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి చెట్లను నరికేవారు అడుగుపెట్టడానికి భయపడటమే కారణం కావచ్చు. మొత్తం మీద అటవీ ప్రాంతాల విస్తరణ స్వల్పమాత్రంగా ఉండగా, నక్సలైట్ల స్వాధీనంలో ఉన్న ఒరిస్సా, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలోని అనేక జిల్లాల పరిధిలోని గిరిజన ప్రాంతాలలో అడవుల విస్తరణ భారీ స్థాయిలో ఉండడం.
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరామ్ రమేష్ దేశంలో అడవుల పరిస్థితిపై సోమవారం విడుదల చేసిన 2009 సంవత్సరపు నివేదిక ప్రకారం, 728 చదరపు కిలో మీటర్ల కొత్త అటవీ ప్రాంతాలలో 690 చదరపు కిలో మీటర్ల ప్రాంతం 188 గిరిజన జిల్లాలలోనే ఉంది. ఒరిస్సాలో 100 చదరపు కిలో మీటర్ల మేరకు, ఝార్ఖండ్ లో 172 చదరపు కిలో మీటర్ల మేరకు అటవీ ప్రాంతం విస్తరణ నమోదైంది. ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రాబల్య జిల్లాలైన బస్తర్, దాంతెవాడలు కూడా అటవీ ప్రాంతాలు పెరిగాయి. అయితే, అదే రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆ జిల్లాలలో అటవీ ప్రాంతాల తగ్గుదలకు గనుల తవ్వకమే కారణమని పేర్కొంటున్నారు.
Pages: 1 -2- News Posted: 1 December, 2009
|