2019లో అసలు ఉపద్రవం వాషింగ్టన్ : భూమిని గ్రహశకలాలు ఢీ కొనడం... గ్రహాల నడుమ ఆకర్షణ... భూమి బద్దలైపోవడం..మానవళి సర్వనాశం...2012 యుగాంతం. హలీవుడ్ నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నఈ సినిమా కథలు నిజం కావని శాస్త్రవేత్తలు ఇప్పుడు తీరిగ్గా శెలవిస్తున్నారు. కానీ ముప్పు మొత్తానికి లేకుండా పోలేదు. రెండు కిలోమీటర్లు వెడల్పు ఉన్న అతి పెద్ద గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకువస్తోంది. ఇది భూమిని 2019 ఫిబ్రవరి ఒకటో తారీఖున ఢీ కొట్టవచ్చని అంచనా వేశారు. ఈ గ్రహశకలం తన కక్ష్యలో పయనిస్తూ సూర్యుణ్ణి చుట్టి రావడానికి 837 రోజులు పడుతోంది.
ఇంత పెద్ద గ్రహశకలం భూమిని ఢీ కొడితే ఏమవుతుంది? చుట్టూ ఉన్న నూట యాభై కోట్ల మంది మానవులను ఊడ్చి పెట్టేస్తుంది. పెద్ద సైజు జీవులను తుడిచిపెట్టేస్తుంది. డీప్ ఇంపాక్ట్ సినిమాలోని డూమ్స్ డే దారుణ దృశ్యాలన్నిటినీ ఆవిష్కరిస్తుంది. ఇది తక్షణం కనిపించే చర్య. ఆ తరువాత సంవత్సరాల తరబడి దీని ప్రభావం కారణంగా భూమిపై వినాశకర పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇలాంటి గ్రహశకలం భూమిని ఢీ కొనడం ఎప్పుడో పదిలక్షల సంవత్సరాలకు ఒకసారి జరిగేది. కొత్తగా వేసిన లెక్కల ప్రకారం ఈ గ్రహశకలం భూమిని ఢీ కొనే అవకాశాలు లేశమాత్రమేనని తేలింది.
భూమికి దగ్గరగా తిరిగే తోకచుక్కలు, గ్రహశకలాలతో సహా అన్ని రోదసి పదార్ధాలను సౌరకుటుంబం కొట్టుకునిపోయేలా చేస్తుంది. ఇవి ఎక్కువగా మంచుగా ఘనీభవించిన నీరు, ధూళి కణాలతో ఏర్పడుతూ ఉంటాయి. గ్రహ వ్యవస్థకు వెలపల చల్లని ప్రదేశాలల్లో తోక చుక్కలు ఏర్పడతాయి. వేడిగా ఉండే రోదసిలో సాధారణంగా గురు, బుధ గ్రహాల మధ్య కక్ష్యల్లో ఘనపదార్ధాలు ఉన్న గ్రహశకలాలు రూపుదిద్దుకుంటాయి. ఇవి భూగ్రం మార్గంలో ఉన్నప్పటికీ ఇతర గ్రహాలు లేదా సూర్యుని గురుత్వాకర్షణ శక్తి లోనై నాశనమైపోతూ ఉంటాయి.
మొన్న అక్టోబర్ ఎనిమిదో తేదీన ఇండోనేషియా గగనతలంలో పది మీటర్ల పరిమాణంలోని గ్రహశకలం వాతావరణంలోకి ప్రవేశించి అగ్నిగోళంలా మండిపోయింది. ఇది 50 కిలోటన్నుల శక్తిని విడుదల చేసింది. దీనిని రాడార్లు రికార్డు చేశాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హిరోషిమాను వల్లకాడుగా మార్చిన అమెరికా అణుబాంబు విడదల చేసిన శక్తి కేవలం 15 కిలోటన్నులంటే గ్రహశకలం శక్తిని అర్ధం చేసుకోవచ్చు. రోదసిలో వందల వేల ధూళి కణాలు, లక్షలాది రాళ్లు, గ్రహశకలాలు, తోకచుక్కలు వివిధ ఆకారాల్లో, సైజుల్లో ఊహించని వేగంతో నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజూ ఏదో మూల భూమిని బాస్కెట్ బాల్ సైజు శకలాలు ఢీ కొడుతూనే ఉంటాయి. కానీ వాటి తాకిడి ప్రభావం ఎలాంటి నష్టం కలిగించదు కాబట్టి ఎవరూ వాటిని పట్టించుకోరు.
Pages: 1 -2- News Posted: 1 December, 2009
|