కేంబ్రిడ్జికి మమత! కేంబ్రిడ్జి : రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. అసలు కోలకతాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి విశ్వవిద్యాలయానికి ఈ ప్రతిపాదన వచ్చింది. కేంబ్రిడ్జిలో ఉపన్యసించేందుకై రైల్వే శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఆహ్వానించగలరా అని విశ్వవిద్యాలయానికి ఆయన ఒక లేఖలో సూచించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తన 800వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది.
ఆ వ్యక్తి ప్రతిపాదనను పరిశీలించిన విశ్వవిద్యాలయం డిప్యూటీ వైస్ చాన్స్ లర్ డేమ్ సాండ్రా డాసన్ తిరిగి లేఖ రాస్తూ, ఇతర ప్రముఖ వ్యక్తులతో పాటు మమత రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొంటే ఇంకా బాగుంటుందని సూచించారు. సిడ్నీ సస్సెక్స్ కాలేజీ మాస్టర్, జడ్జి బిజినెస్ స్కూల్ లో కెపిఎంజి మేనేజ్ మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, 1999 నుంచి 2009 వరకు అక్కడ డైరెక్టర్ గా ఉన్న డేమ్ సాండ్రా ప్రస్తుతం కేంబ్రిడ్జి ఇండియా భాగస్వామ్యం (సిఐపి) సంస్థకు చైర్ పర్సన్ గా ఉన్నారు.
రౌండ్ టేబుల్ చర్చ అయితే మరింత విలువను సంతరించుకోవచ్చునని భావించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రవాణాపై మమత సిద్ధాంతాలను, సాంఘిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిపై ఆమె అభిప్రాయాలను ఇతర ప్రముఖులతో కలసి విశ్లేషించవచ్చునని డేమ్ సాండ్రా భావన.
డేమ్ సాండ్రా ఒక బహిరంగ ఆహ్వాన లేఖను రాశారు. అందులో మమతను 'అసాధారణ, విశిష్ట రాజకీయ నాయకురాలు'గా అభివర్ణించారు. లోక్ సభ వెబ్ సైట్ లో గల మమత వ్యక్తిగత సమాచారం ప్రకారం, ఆమె 'ఎంఎ, బిఇడి, ఎల్ఎల్ బి, కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. శ్రామిక విద్యలో శిక్షణ పొందారు'. ఇండియాలో ఆమె సహచరులలో ఒకరు ఒక వార్తా సంస్థ విలేఖరితో మాట్లాడుతూ, 'కేంబ్రిడ్జికి ప్రతిపాదిత పర్యటన గురించి విశ్వవిద్యాలయం అధికారుల దగ్గర నుంచి మాకు ఒక లేఖ అందింది. మంత్రి ఈ పర్యటనకు విముఖంగా లేరు' అని తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 4 December, 2009
|