ఎవరెస్ట్ పై కేబినెట్ మీటింగ్ సియాంగ్ బోచె (నేపాల్) : ఎవరెస్ట్ శిఖరం పాదపీఠంపై ప్రధాని, అతని ఇరవై మంది మంత్రి వర్గ సహచరులు కేబినెట్ సమావేశం నిర్వహించారు. నేపాల్ అగ్ర శ్రేణి రాజకీయ నాయకులు శుక్రవారం ఆక్సిజన్ టాంకులు తమ వీపుపై ధరించి ఎవరెస్ట్ శిఖరంపై మంత్రివర్గ సమావేశం జరిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమ నదాలకు వాటిల్లే ముప్పు గురించి నొక్కి చెప్పడం వారి ఈ భేటీ ఆంతర్యం. అంతర్జాతీయ పర్యావరణ పరిస్థితులపై వచ్చే వారం డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్ లో నిర్వహించనున్న ప్రపంచ స్థాయి సదస్సుకు ముందుగా ఈ సమావేశం జరిగింది.
ప్రపంచంలో అత్యంత ఎత్తులో జరిపిన సమావేశంగా ప్రభుత్వం దీనిని అభివర్ణించింది. పసుపు రంగు ఆక్సిజన్ మాస్కులు, 'హిమాలయాలను కాపాడండి' అనే నినాదం రాసిన వంగపండు రంగు స్కార్ఫ్ లను ధరించిన మంత్రులు మంచుతో కప్పబడిన ఎవరెస్ట్ శిఖరం నేపథ్యంలో ఒక మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై ఫోల్డింగ్ టేబుల్స్ వద్ద ఆశీనులయ్యారు. వారు ఫోటోల కోసం పోజులు ఇచ్చారు. పర్యావరణ నిబంధనలను కట్టుదిట్టం చేస్తామని, దేశ రక్షిత ప్రాంతాలను విస్తరిస్తామని వాగ్దాన పత్రంపై సంతకాలు చేసి వాకు ఆతరువాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో నిష్క్రమించారు.
'ఎవరెస్ట్ శిఖరంపైన, హిమాలయాలలోని ఇతర శిఖరాలపైన పర్యావరణ మార్పు వ్యతిరేక ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించాలని ప్రపంచానికి ఈ ఎవరెస్ట్ ప్రకటన సందేశం ఇస్తున్నది' అని నేపాల్ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ ఆతరువాత తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 5 December, 2009
|