తరువాత ఏమిటి? హైదరాబాద్ : హింసా మార్గంలోకి మలుపు తిరిగింది తెలంగాణ ఉద్యమం. విధ్వంసక చర్యలకు దిగడం ద్వారా ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు వ్యూహాత్మక దశలోకి ప్రవేశించారు. ఏకైక లక్ష్యం ప్రభుత్వంపై 'వత్తిడి' పెంచడం. దిగివచ్చేటట్లు చేయడం. తాము డిమాండ్ చేసింది ఇవ్వకపోతే సామాజిక శాంతికి తావు లేదని హెచ్చరికలు జారీ చేయడం. ఆమరణ దీక్షలో ఉన్న తెరాస అధినేత కె చంద్రశేఖరరావును నిమ్స్ వైద్యులు ఐసిసియుకు తరలించడంతో ఈ శనివారం తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళడానికి అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులనూ కల్పించింది.
రాష్ట్ర రాజధాని నగరంలో విధ్వంసక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. సరే తెరాస నాయకత్వమే తమ కార్యకర్తలను దీనికి పురికొల్పిందా? లేక కేసీఆర్ దీక్షను అడ్డం పెట్టుకుని మరే ఇతరేతర శక్తులు ఈ దాడులకు దిగాయా అన్న సందేహం ప్రస్తుతానికైతే అప్రస్తుతం. కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న సందేహాలు ఎన్నో. ముఖ్యంగా తెరాస అధినేత చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఏమిటి? దాన్ని వెన్నంటే పరిణామాలు ఏమిటి? ప్రాణత్యాగాలు, విధ్వంసాలు తరువాత ఏమిటి? కేసిఆర్ ను ఐసిసియులోకి తరలించడాన్ని వైద్యులు ఎంత చెబుతున్నా ప్రజలు మాత్రం ప్రమాదానికి సంకేతంగానే భావిస్తున్నారు.
నిరాహారంగా వారం రోజులు ఉండగలిగే శరీర దారుఢ్యం కేసిఆర్ కు లేదు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి కాదు. తిండి తినకుండా వారం రోజులు గడపడమే కేసిఆర్ భౌతిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీయవచ్చు. దానికి తోడు మధుమేహం, రక్తపోటు, దెబ్బతిన్న కాలేయం తదితర అనారోగ్యాలు కేసిఆర్ కు ఉన్నాయి. శనివారం రాత్రికి ఆయన ఆరోగ్యం చాలా నిలకడగానే ఉన్నప్పటికీ ఆయనకు జరిగి వైద్యపరీక్షలు 'పస్తుల' ప్రభావాన్ని సూచిస్తున్నాయి. నిస్సందేహంగా కేసిఆర్ ప్రమాదపు లోగిలిలోకి అడుగుపెట్టారు.
వాస్తవానికి కేసీఆర్ సంపూర్ణ దీక్షలో లేనట్లే. ఆయనకు 'బలవంతం'గా వైద్యులు శరీరానికి అవసరమైన ద్రవపదార్ధాలను నరాల ద్వారా పంపిస్తున్నారు. కాని అది సరిపోదు. దీక్షను విరమించడానికి ఉన్న అన్ని మార్గాలను కేసీఆర్ అన్వేషిస్తునే ఉన్నారని, తెలంగాణ కు సంబంధించి స్పష్టమైన ఏదైనా హామీని కేంద్రం ఇవ్వడం గాని, లేదా సోనియాగాంధీ చర్చలకు ఆహ్వానించడం గాని ఏదిచేసినా దీక్షను విరమించాలనే ఆయన భావిస్తున్నారని కేసిఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలా కాకుండా దీక్ష విరమిస్తే తెలంగాణ ఉద్యమం తన చేతుల్లోంచి జారిపోతుందని కేసిఆర్ కు స్పష్టంగా తెలుసని, విద్యార్ధుల నాయకత్వంలోకి ఉద్యమం బదలీ అయిపోతే తెరాస స్థితి దయనీయంగా మారుతుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే ఉద్యమంలో క్రియాశీలక పాత్రలోకి విద్యార్ధీ నాయకులు ప్రవేశించారని, వారు తెరాస నాయకుల సూచనలను ఖాతరు చేయడం లేదని వారి కథనం.
Pages: 1 -2- News Posted: 5 December, 2009
|