తెర చాటున... మేధావులే? హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం కోసం ప్రధానంగా విద్యార్థుల ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమంలో ఆశ్చర్యకరంగా మేధావి వర్గం ప్రత్యక్షంగా కనిపించడం లేదు. కాని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు 'అదృశ్యంగా మద్దతు' లభిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ పట్ల సానుభూతి ఉన్నవారిగా పేర్కొంటన్న పలువురు మేధావులు ప్రస్తుతం తమ ఉనికిని బాహాటంగా చాటడం లేదు. కాని ఉద్యమం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వారు ఇందుకు మద్దతు ఇస్తున్నారనేది సుస్పష్టం అవుతుందని 'టి' ఉద్యమం పరిశీలకులు అంటున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు) ప్రొఫెసర్లు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ (టిఐఎఫ్)తో సహా కొన్ని వర్గాలు విచిత్రంగా ఉద్యమంలో పాలుపంచుకోవడం లేదు. ఒయు ప్రొఫెసర్లు పి.ఎల్. విశ్వేశ్వరరావు, కంచె ఐలయ్య, భాగ్యా నాయక్ తో సహా సీనియర్ ప్రొఫెసర్లు సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి)కి ఉద్దేశపూర్వంగానే దూరంగా ఉంటున్నారు. అయితే, వారు దూరంగా ఉంటున్నది ఉద్యమం పట్ల సానుభూతి లేకపోవడం వల్ల కాదని, దీనికి రాజకీయ రంగు పులమడం ఇష్టం లేకేనని విశ్లేషకులు వివరిస్తున్నారు. 'సమాజంలో అన్ని వర్గాల మద్దతు లభించే విధంగా రాజకీయాలతో నిమిత్తం లేని విద్యార్థుల ఉద్యమంగా ఇది కనిపించాలని వారి అభిమతం' అని తెలంగాణ మద్దతుదారుడు ఒకరు చెప్పారు.
గడచిన వారం రోజులుగా తెలంగాణ ప్రాంతంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలోని మొత్తం పది జిల్లాలలో గల విశ్వవిద్యాలయాలను మూసి వేసి విద్యార్థులకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు ఒక 'సామాజిక ఉద్యమం'లో పాల్గొంటున్నారని విశ్వవిద్యాలయాల సీనియర్ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 7 December, 2009
|