మావోయిస్టు మలేరియా! పాట్నా : ఝార్ఖండ్ లో పోలీసులు, పారామిలటరీ జవానులు గడగడ వణికిపోతున్నారు. మావోయిస్టులను చూసి కాదు. ఝార్ఖండ్ లో ప్రస్తుతం దశలవారీగా సాగుతున్న శాసనసభ ఎన్నికలలో విధుల నిర్వహణ కోసం వచ్చిన పారామిలిటరీ బలగాలు తమపై దాడి జరుపుతున్న శక్తులు మావోయిస్టుల వలె ఎంతకైనా తెగించేవని, వాటికి తుపాకుల భయం లేదని గ్రహించారు. ఆ శక్తులు ఇంకేవో కాదు. దోమలే. దోమ కాట్ల వల్ల ఝార్ఖండ్ గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల డ్యూటీలో ఉన్న వందలాది మంది సైనికులు మలేరియా బాధితులుగా మారారు.
మలేరియా వ్యాధి సోకినట్లు నిర్థారణ జరిగిన తరువాత ఇప్పటికే దాదాపు 50 మంది సైనికులను ఆసుపత్రిలో చేర్పించినట్లు, ఇంకా పలువురిలో మలేరియా లక్షణాలు కనిపించాయని అధికారులు తెలియజేశారు. రాంచిలోని రాజేంద్ర ప్రసాద్ వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (రిమ్స్)లో ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్న సైనికులు మలేరియా క్రిముల వ్యాప్తి వల్ల తీవ్ర జ్వరంతోను, వాంతులతోను బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. వారంతా నాగాలాండ్ సాయుధ పోలీస్ (ఎన్ఎపి) దళానికి చెందినవారు.
మస్కిటో రిపెల్లెంట్లు గాని, దోమతెరలు గాని, చివరకు పరిశుద్ధమైన తాగు నీరు కూడా లేకుండానే దట్టమైన అడవులతో కూడిన ఝార్ఖండ్ లోతట్టు ప్రాంతాలలో పని చేయవలసి రావడం, రాత్రులు గడపవలసి రావడం వల్ల సైనికులు మలేరియా బారిన పడ్డారని కొన్ని వర్గాలు తెలియజేశాయి. 'సైనికుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. వారి రక్తాన్ని, యూరిన్ శాంపిల్స్ పరీక్షించినప్పుడు వారు మలేరియా క్రిముల బారిన పడినట్లు స్పష్టమైంది. వారిలో కొందరు పచ్చకామెర్ల వ్యాధికి కూడా గురయ్యారు' అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.కె. మహతో తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 7 December, 2009
|