రాజుకున్న 'నిప్పు' హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు 'నిర్ణయాత్మక దశ'కు వచ్చింది. తెరాస అధినేత కేసిఆర్ దీక్షతో, విద్యార్ధుల ఉద్యమంతో, తెలంగాణ కాంగ్రస్ నేతల లాబీయింగ్ తో కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రదేశంలో వేర్పాటు వాదం తెలంగాణతో మొదలైనా, దానితోనే ఆగిపోలేదు. ప్రాంతాల వారీ వేర్పాటు వాదాలకు ఎప్పుడో బీజాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు ఆంధ్రరాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర 9 జిల్లాలతోనూ, రాయలసీమ నాలుగు జిల్లాలతోనూ, తెలంగాణ పది జిల్లాలతోనూ ప్రత్యేక ప్రాంతాలుగా ఉన్నాయి. భాష ఒక్కటే అయినా ఆచారవ్యవహారాల్లో, జీవనశైలిలో,పంటల సాగులో, ఆహారపు అలవాట్లలో, భాషా ఉచ్చారణ బేధాలలో, వస్త్రధారణలో, సాంఘిక ప్రవర్తనలో ప్రాంతాల వారీ తేడాల్లో మార్పులు రాలేదు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడి యాభైఐదేళ్ళు కావస్తున్నారాష్ట్ర ప్రజల మద్య సంపూర్ణ సమైక్యత అన్నది ఏర్పడలేదు. ఆర్ధిక, సామాజిక వ్యత్యాసాల్లో మార్పులు రాని నేపథ్యంలో వేర్పాటు వాదాలు బలాన్ని పుంజుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడటమే సింగిల్ పాయింట్ ఎజెండాతో వచ్చింది. అది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. లక్ష్యసాధనలో ఎనిమిదేళ్లపాటు పిల్లిమొగ్గల పోకడలు పోయినప్పటికీ చివరకు ఆమరణ దీక్ష అస్త్రంలో తెరాస వ్యవస్థాపకుడు కె చంద్రశేఖరరావు చరిత్రాత్మక విజయాన్నే సాధించారు. అయితే 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 అర్ధరాత్రి వరకూ సాగిన ఈ ఉద్యమం పూర్తిగా తెరాస అధినేత కనుసన్నల్లోనే జరగలేదు. విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు దీనిని నడిపించారు. అలా ఉద్యమం ఐక్యపథాన సాగడానికి కేసిఆర్ దీక్ష కీలకమైన ఉపకరణంగా ఉపయోగపడింది. ఇంకో రాజకీయపరమైన పరిణామం ఏమిటంటే ఈ ఉద్యమంలోకి భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా దూకడం. రాజకీయంగా కునారిల్లిపోయి, దాదాపు బహిరంగ వేదికపై స్థానం కోల్పోయిన దశలో కాస్త జీవం నింపడానికి బిజెపి నాయకులు తెలంగాణను ఆసరా చేసుకున్నారు. అసలు ఈ పార్టీ 1998లోనే ఒక వోటు వేయండి. రెండు రాష్ట్రాలు పొందండి అంటూ ఎన్నికల్లోకి దిగింది. కాని మంత్రం ఫలించలేదు. ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 10 December, 2009
|