భీతిగొల్పుతున్నబీటలు! హైదరాబాద్ : ఎంతలో ఎంతమార్పు? ఎంతటి సంక్షోభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కనీసం పదిరోజుల క్రితం ఊహించను కూడా లేని రాజకీయకల్లోలం. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం సంబురాలు జరుగుతుంటే కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో అవమాన సెగలు, సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు రగులుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తూ రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి వెళ్ళి, తెరాస అధినేత కేసిఆర్ ప్రాణాపాయస్థితిలో పడినా తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామాల జోలికి వెళ్ళలేదు. కానీ సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం ద్వారా ఉద్యమానికి తోడ్పాటు ప్రకటిస్తున్నారు. తలలు పండిన కాంగ్రెస్ అధిష్టాన నేతలు సైతం ఈ పరిణామాలను అంచనా వేసినట్లు లేదు.
ఈ విపరీత పరిణామాలుకు కారణం ఒక్కటే. ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసినా తెరాస ఘోరంగా వైఫల్యం చెందింది. దాంతో అత్యధిక తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం పట్ల అనుకూలంగా లేరని, అందుకే కాంగ్రెస్ పట్టం కట్టారనే వాదన బలంగా వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెరాస నాయకత్వం ఎలాంటి ఉద్యమాలకు సాహసించలేదు. కానీ అయన దుర్మరణంతో అటు కాంగ్రెస్ లో బయటపడిన అంతర్గత కలహాలు పార్టీలోని డొల్లతనాన్ని, నాయకుల్లో అనైక్యతను బయటపెట్టాయి. ఇటు ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలం అని చెప్పిన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు ఇక తెరాస ఏం చేసినా గట్టిగా గొంతెత్తే సహసం చేయలేదు. ఈ బలహీనతలను గమనించిన కేసిఆర్ ఈ పార్టీల మెడలు వంచడానికి ఇదే సరైన సమయమని గ్రహించారు. సాదాసీదా కార్యకలాపాలతో లాభం లేదని భావించారు. దానికి తోడు తెరాసలో కుమ్ములాటలు ఇక తన భవిష్యత్ ను అగమ్యగోచరం చేస్తాయనీ అంచనా వేసారు. ఏదో ఒకటి చేయమని పార్టీ నాయకత్వం నుంచి విపరీతంగా పెరిగిపోయిన వత్తిడితి కేసిఆర్ తలవంచాల్సి వచ్చింది. ఆయన బ్రహ్మాస్త్రంగా ఆమరణ దీక్షను చేపట్టారు. తెలంగాణ తెచ్చుడో... కేసిఆర్ చచ్చుడో నినాదం బాగా పనిచేసింది.
గత పదకొండు రోజులుగా తెలంగాణ అట్టుడికిపోతున్నా, దానికి నిరసనగా గాని, వ్యతిరేకంగా గాని ఈ తెలంగాణయేతర ఎమ్మెల్యేలు మాట్లడలేదు. మాట్లడనివ్వలేదు. కాని తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వరస ప్రకటనలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ఉంచాలని సూచించిన పాపానికి దానం నాగేందర్ ఇంటిపై దాడి జరిగితే సహచరులు ఒక్కరు కూడా వారికి బాసటగా నిలబడలేదు. ఇంకాస్త ముందుకుపోతే శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా నాయకులు పోటీలు పడి మరీ ప్రకటించినప్పుడు ఎవ్వరూ సప్పుడు చేయలేదు. దీనంతటికీ ఒకటే కారణం ఈ నాయకులు ఏ ప్రకటనలు చేసినా ఏదోలా కేంద్రప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేస్తుందని, తెలంగాణ ఇస్తామన్న ప్రకటన చచ్చినా చేయదని, ఇక తీర్మానం దాకా విషయాన్ని రానివ్వదని వీరంతా చాలా గాఢంగా నమ్మారు. హామీలే కదా అని నోరు మెదపలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర నాయకత్వం మరో కన్నుతో చూసింది. చాలా కాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించడమే మేలని భావించింది. ఎలానూ మధుయాష్కీ గౌడ్, హనుమంతరావు, కేశవరావు లాంటి సీనియర్లు ఇచ్చిన సలహాలు కూడా బాగా పనిచేశాయి. కాబట్టే తెలంగాణయేతర ప్రజాప్రతినిధులు, నాయకులు(పార్టీలతో సంబంధం లేదు) కలలో కూడా ఊహించని సంచలన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది.
Pages: 1 -2- News Posted: 10 December, 2009
|