'టి' మైనస్ హైదరాబాద్! న్యూఢిల్లీ: తెలంగాణా ఏర్పాటు జరిగితే అది మైనస్ హైదరాబాద్ గానే చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు కోస్తాంధ్రకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. తెలంగాణా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన గురువారంనాడు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగా ప్రకటించిన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం అర్థరాత్రి వరకు పార్టీ సీనియర్ నాయకులతో ఈ అంశంపై దఫదఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సోనియా గాంధీ గురువారం సాయంత్రం సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు వలన ఇతర ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంతో ఎంపీలు ఈ సమావేశంలో సోనియా గాంధీకి క్షుణ్ణంగా వివరించినట్లు తెలిసింది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణాలో భాగం చేయడం వలన కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజల ప్రయోజనాలతోపాటు వారు నెలకొల్పిన పరిశ్రమలు, పెట్టిన పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారాలకు తీవ్రమైన ముప్పు ఏర్పడే ప్రమాదాన్ని ఎంపీలు సోనియా గాంధీకి పూసగుచ్చినట్లు వివరించారు. హైదరాబాద్ నగరం లేకుండా తెలంగాణాను ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని కూడా కొందరు ఎంపీలు పార్టీ అధ్యక్షురాలికి సూచనప్రాయంగా తెలిపారు. వాస్తవానికి తెలంగాణా ప్రకటన చేయడానికి ముందు కూడా కాంగ్రెస్ కోర్ కమిటీ హైదరాబాద్ భవిష్యత్తుపై లోతుగా చర్చించినట్లు తెలిసింది.
Pages: 1 -2- News Posted: 10 December, 2009
|