కాంగ్రెస్ 'దూర'దృష్టి న్యూఢిల్లీ : తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే కోర్కెకు తలొగ్గడం ఇతర రాష్ట్రాలలో నిద్రాణంగా ఉన్న ప్రత్యేక రాష్ట్రాల ఆందోళనకు తిరిగి ఆజ్యం పోయవచ్చునేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నది. కాని ఇటు ఆంధ్రను, అటు కొత్త రాష్ట్రాన్ని పాలించే అవకాశంతో సహా రాజకీయంగా ప్రయోజనాలు దక్కగలవని పార్టీ ఆశిస్తున్నది.
తెలంగాణను ఈ ఇతర డిమాండ్లకు ముడిపెట్టజాలరని, దీనిని ఒక ఆనవాయితీగా భావించరాదని స్పష్టం చేయడానికి పార్టీ గురువారం ఎంతో ప్రయాస పడింది. తెలంగాణ డిమాండ్ కు అంగీకరించడం వల్ల అనుకోకుండా రెండు సందేశాలు వెళ్లి ఉండవచ్చునని కాంగ్రెస్ కలవరపడుతున్నది. వాటిలో ఒకటి - 2009 ఎన్నికల విజయానంతరం మరింత బలంగా కనిపించిన పార్టీ తనకు ఎదురైన సిసలైన మొదటి రాజకీయ సంక్షోభానికే తడబాటుకు గురైంది. గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) వంటి దాదాపుగా చిన్న పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఎటూ పాలుపోని స్థితిలోకి నెట్టగలిగారు.
కెసిఆర్ నిరాహార దీక్షకు, 'నియంత్రించదగిన' వీధి అల్లర్లకు లొంగిపోయే బదులు సొంత షరతులతో తెలంగాణను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఇష్టపడి ఉండేదని పార్టీ నాయకులు కొందరు అంగీకరించారు. అయితే, క్షీణిస్తున్న కెసిఆర్ ఆరోగ్యం అందరినీ భయపెట్టింది. మరి 'కెసిఆర్ మరణిస్తే ఎమవుతుంది?' అని ఒక నాయకుడు అడిగారు. 'బుధవారం పార్లమెంట్ లో అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు అందజేశాయి. బలహీనమైన రోశయ్య ప్రభుత్వం హైదరాబాద్ లో పెచ్చరిల్లుతున్న అశాంతిని అదుపు చేయగలిగేది కాదు' అని ఆ నాయకుడు అన్నారు.
ప్రధాని దేశంలో లేనందున ఈ విషయమైన నిర్ణయాన్ని పార్టీ ఆలస్యం చేయవలసి వచ్చిందని, అర్ధరాత్రి ప్రకటించవలసి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రతిపత్తి మంజూరుపై సోనియా గాంధి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే డిసెంబర్ 7న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కోరినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాన్ని శాసనసభలో తీసుకురావాలన్న నిర్ణయాన్ని కెసిఆర్ కు కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం బుధవారం మధ్యాహ్నం తెలియజేసినట్లు ఆ వర్గాలు చెప్పాయి.
తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పూర్తిగా బలహీనుడిని చేయడానికి, జగన్మోహన్ రెడ్డి పలుకుబడిని అదుపు చేయడానికి రాష్ట్ర విభజనే అత్యుత్తమ మార్గమని తెలంగాణ అనుకూలురైన నాయకులు సోనియాకు నచ్చజెప్పారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కాని ఆయన మృతి వల్ల తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అధిష్ఠానానికి ఒక అవకాశం లభించింది.
కొత్త రాష్ట్రాన్ని ఏడాదిన్నర కాలంలో ఏర్పాటు చేయవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువులోనే కొత్త రాష్ట్రం ఏర్పాటు జరిగినట్లయితే, తెలంగాణ ప్రాంతంలోని సీట్లు కొత్త రాష్ట్రానికి బదలీ అవుతాయి. ప్రస్తుతం ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ప్రాతిపదికపైనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే రెండు రాష్ట్రాలలోను ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కు వీలు కలుగుతుందన్నమాట.
Pages: 1 -2- News Posted: 11 December, 2009
|