హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సూచికగా రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదింపచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) కంగుతిన్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణకు అనుకూలంగా నమ్మదగిన రీతిలో ఎన్నడూ ప్రకటనలు చేయని టిడిపి గురువారం తన అసలు వైఖరిని బయటపెట్టింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర నిర్ణయాన్ని తప్పు పట్టారు. తెలంగాణపై శాసనసభలో ఎప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టితే అప్పుడు పార్టీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించదని ప్రకటించిన 24 గంటల తరువాత చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించారు.
వాస్తవానికి అలా అనడం ద్వారా కాంగ్రెస్ ను సంక్లిష్ట స్థితిలోకి నెట్టడం టిడిపి ఎత్తుగడ. కాని ఇప్పుడు ఆ వ్యూహమే బెడిసికొట్టింది. రెంటికి చెడిన రేవడిలా తయారైంది టిడిపి పరిస్థితి. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు టిడిపి ఎన్నడూ విశ్వసించలేదు. ఇప్పుడు ఆంధ్రా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుపై మండిపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ డిమాండ్ ను కేంద్రం అంగీకరించడానికి కారణాలలో ఒకటి కనుక ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి బాబు గురవుతున్నారు.