మరో ఎస్సార్సీపై యోచన న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందంటూ చేసిన ప్రకటన పర్యవసానంగా కొత్త రాష్ట్రాలకు డిమాండ్లు పెరిగిపోతుండడంతో ఊబిలో చిక్కుకున్నట్లుగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఆ డిమాండ్లకు అడ్డుకట్ట వేయడానికి రెండవ రాష్ట్ర పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్ సి)ను నియమించాలని యోచిస్తున్నది. కొత్త ఎస్ఆర్ సికి అన్ని డిమాండ్లను పరిశీలించాలని నిర్దేశిస్తే తెలంగాణ నిర్ణయం వల్ల తలెత్తిన సమస్యను అధిగమించవచ్చునని పార్టీ ఆశిస్తున్నది. డార్జిలింగ్, అసోం, ఉత్తర ప్రదేశ్, బీహార్ లతో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ డిమాండ్లు ప్రతిధ్వనించసాగాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నుంచి బుందేల్ ఖండ్, హరిత్ ప్రదేశ్ ఏర్పాటుకు తాను సిద్ధమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ఐచ్ఛికంగా ప్రకటన చేసి మరింత అల్లకల్లోలం సృష్టించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని భోజపురి భాష మాట్లాడే జిల్లాలతో కొత్తగా పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జెడి) నేత లాలూ ప్రసాద్ యాదవ్ పునరుద్ధరించారు. విదర్భ, బోడోలాండ్ వంటి ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లు కూడా తిరిగి తెరపైకి వచ్చి, భారతదేశ చిత్రపటాన్ని తిరిగి గీయవలసిన ఆవశ్యకతను సృష్టిస్తాయని ఆందోళన చెందుతున్నారు.
ఇక ప్రస్తుత సంక్షోభానికి కేంద్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణపై కేంద్రం చేసిన ప్రకటన పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నది. కేంద్రం ప్రకటనకు నిరసన సూచకంగా 135 మందికి పైగా శాసన సభ్యులు రాజీనామా చేశారు. ఇక ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తెలంగాణ వ్యతిరేక వైఖరిని అనుసరించవలసి వస్తున్నది. కాంగ్రెస్ లో చాలా మంది ఇలా చేయవలసి వస్తుందని కనీసం ఊహించను కూడా లేదు.
'తెలంగాణ కోసం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా నన్ను మౌఖికంగా గాని, లిఖితపూర్వకంగా గాని ఆదేశించలేదు' అని రోశయ్య శుక్రవారం రాష్ట్ర విభజన వ్యతిరేకులను సముదాయించేందుకు ప్రయత్నిస్తూ చెప్పారు. రాజీనామా చేయవద్దని, దానికి బదులు అసెంబ్లీలో 'తెలంగాణ తీర్మానాన్ని' ప్రవేశపెట్టినప్పుడు దానిని 'ఓడించవలసింద'ని పార్టీ ఎంఎల్ఎలకు నచ్చజెప్పే బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ ఎంపిలకు పార్టీ అధిష్ఠాన వర్గం అప్పగించింది.
Pages: 1 -2- News Posted: 12 December, 2009
|