అడకత్తెరలో సిపిఎం న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తే చారిత్రక విప్లవ కేంద్రంలో మద్దతు కోల్పోవలసి వస్తుంది. తెలంగాణకు ఓకే అంటే ఆధువిక కాలంలో తమకు పెట్టని కోట వంటి బెంగాల్ విభజనకు మార్గం సుగమం చేసినట్లవుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతున్న తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టినట్లయితే ఏ విధంగా ఓటు వేయాలో సిపిఎం తేల్చుకోలేకపోతున్నది. రాష్ట్ర సరిహద్దులకు తిరిగి రూపకల్పన చేసిన భాషా ప్రాతిపదికను తోసిరాజనడమే అవుతుందన్న కారణంతో తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తిని వ్యతిరేకిస్తున్న ఏకైక పార్టీ సిపిఎం అనే సంగతి తెలిసిందే.
'తీర్మానం గురించి ఇప్పుడు మేము ఎలా నిర్ణయం తీసుకోగలం? ముందు కాంగ్రెస్ ఆలోచన ఏమిటో స్పష్టం కానివ్వండి. కాని, కాంగ్రెస్ ధర్మమా అని ప్రస్తుతం పరిస్థితి అంతా గందరగోళంగా తయారైంది' అని సిపిఎం నాయకురాలు బృందా కరత్ అన్నారు.
తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తిని అదేపనిగా వ్యతిరేకిస్తుంటే, ఆ ప్రాంతంలో (సిపిఐతో కలసి) తమకు ఉన్న చెప్పుకోదగిన మద్దతుకు గండి పడవచ్చునని మార్క్సిస్టులకు తెలుసు. 1940 దశకం ఆరంభంలో స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో సాగిన తెలంగాణ 'సాయుధ పోరాటం' ఫలితంగా ఈ రెండు పార్టీలకు ఈ ప్రాంతంలో బలం చెప్పుకోదగిన రీతిలోనే ఉంది. రాష్ట్ర శాసనసభలో సిపిఎంకు గల ఎనిమిది సీట్లలో ఐదు తెలంగాణలోనే ఉన్నాయి. ఇంకా 2004లో రాష్ట్రం నుంచి గెలుచుకున్న ఏకైక లోక్ సభ స్థానం కూడా తెలంగాణలోనే ఉన్నది.
అయితే, గూర్ఖాలాండ్ ఏర్పాటు కోసం బెంగాల్ ను విభజించవలసిన ముప్పు ఎదురవుతోంది. 'చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం వచ్చే ఇటువంటి డిమాండ్లకు తెలంగాణ ప్రోత్సహించగలదు. తద్వారా ఫెడరల్ వ్యవస్థ బలహీనం కాగలదు' అని సిపిఎం నాయకుడు సీతారామ్ ఏచూరి వ్యాఖ్యానించారు. కాని ఆయనలో నిర్వేదం ఆవరించింది. సిపిఎం వ్యతిరేకించినా 'జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఏర్పాటు ఆగలేదు కదా' అని ఆయన అన్నారు.
News Posted: 12 December, 2009
|