సోనియా దూరాలోచన? హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా బుధవారం అర్ధరాత్రి ప్రకటన చేయనిచ్చే ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉంటారు? పార్టీ వర్గాల మాటలనే విశ్వసించవలసి వస్తే, నిరాహార దీక్ష సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖరరావును బుజ్జగించడం ప్రధానోద్దేశం మాత్రం కాదు. అత్యున్నత పదవిని రాహుల్ గాంధి స్వీకరించగలరని భావిస్తున్న సమయం 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు లభించేలా చూడడమే ఆమె ఆంతర్యం. 'దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని సోనియా గాంధి తీవ్ర కలవరంతో గడచిన రెండు రోజులుగా తనను కలుసుకుంటున్న కోస్తా ఆంధ్ర కాంగ్రెస్ ఎంపిలతో చెప్పినట్లు తెలుస్తున్నది. దేశ శ్రేయస్సు అంటే రాహుల్ గాంధి ప్రధాని కావడమని అర్థం చేసుకోవచ్చు.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతించడంతో తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే స్థితి ఎటువంటిదో సోనియాకు తెలుసు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పాలనాదక్షుడే కాని జన బలం గల నాయకుడు కారు. ఇప్పుడున్న 33 మంది ఎంపిలను తిరిగి గెలిపించుకోవడం మాట అటు ఉంచితే కాంగ్రెస్ చెప్పుకోదగిన స్థానాలను గెలుచుకోవడం కష్టమేనని చెప్పవచ్చు.
ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే అత్యుత్తమ మార్గమని సోనియా భావించినట్లున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన మరుక్షణం టిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగలనని కెసిఆర్ ఇదివరకే ప్రకటించారు. అందువల్ల తెలంగాణలోని 19 ఎంపి సీట్లలో మెజారిటీని తాము గెలుచుకునే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ (టిడిపి) నిలకడలేమి కారణంగా ఈ ప్రాంతంలో ఆ పార్టీ బలం కుంచించుకుపోగలదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును తాము అభ్యంతరం చెప్పబోమని తొలుత ప్రకటించిన టిడిపి ఇప్పుడు మాట మార్చిన సంగతి విదితమే.
Pages: 1 -2- News Posted: 12 December, 2009
|