శ్రీవారికీ తప్పని నష్టాలు! తిరుమల : సమైక్య ఆంధ్ర ఉద్యమ ప్రభావం శ్రీ వెంకటేశ్వరుని సంపాదనపై కూడా పడింది. గడచిన మూడు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం కేవలం రూ. 1.8 కోట్లు. గడచిన పదేళ్ల కాలంలో ఇదే అత్యంత తక్కువ ఆదాయం. 2004 తరువాత ఏ ఒక్క రోజు కూడా హుండీ వసూళ్లు కోటి రూపాయలకు తగ్గలేదని ఆలయ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సాగుతున్న సమైక్య ఆంధ్ర ఉద్యమం కారణంగా హుండీ వసూళ్లు గణనీయంగా పడిపోయాయని అధికారులు తెలిపారు.
'ఇది యాత్రికులకు అత్యంత అనువైన కాలం కనుక వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా దక్షిణాది నుంచి లక్షలాది మంది యాత్రికులు వస్తారని మేము ఊహిస్తున్నాం. కాని బస్సు సర్వీసులు కుదించడంతోను, తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతోను యాత్రికుల సంఖ్య తగ్గిపోయింది. గడచిన మూడు రోజులలో కోటి 80 లక్షల రూపాయలు మాత్రమే వసూలయ్యాయని మా పరకామణి అధికారులు చెబుతున్నారు' అని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
సెప్టెంబర్ బ్రహ్మోత్సవాలలో ఒక రోజు రూ. 3.08 కోట్ల మేరకు హుండీ వసూళ్లు జరిగినందున టిటిడి ఉన్నతాధికారులకు ఈ పరిస్థితికి నోట మాట రావడం లేదని ఆలయ వర్గాలు చెప్పాయి. (తిరుమల ఆలయం చరిత్రలో అదే రికార్డు వసూలు.) 'ఇటువంటి పరిస్థితి తలెత్తుతుందని మేము ఎన్నడూ ఊహించలేదు. భయం, తదితర కారణాలతో యాత్రికులు తిరుమలకు రావడం తగ్గిపోతే ఆలయానికే మంచిది కాదు' అని మరొక అధికారి అన్నారు.
Pages: 1 -2- News Posted: 15 December, 2009
|