ఆలస్యం విషం న్యూఢిల్లీ : ఒక్క రోజులో డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వలేదా? రేషన్ కార్డు ఇవ్వడానికి ఆఫీసరు నస పెడుతున్నాడా? నిర్దేశించిన సమయంలోగా ప్రజలకు చట్టప్రకారం అందించాల్సిన సేవలను వీళ్లు కావాలని ఆలస్యం చేస్తున్నారా? అలాంటి ప్రభుత్వ అధికారుల జేబులు ఇకపై చిరగడం ఖాయం. సేవలు ఆలస్యం చేసినందుకు సదరు లబ్దిదారునికి నష్టపరిహారం చెల్లించాలి. సర్కారీ బాబు (ఆఫీసర్)ను కూడా చివరకు జవాబుదారీ చేయనున్నారు. జనానికి ఆనందం కలిగించే చర్యగా ఢిల్లీ ప్రభుత్వం దీనిని అమలు చేయబోతోంది. కావాలని ఫైళ్లను నొక్కిపెట్టినట్లుగా తేలిన అధికారులను శిక్షించబోతున్నది. రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎన్నికల గుర్తింపు కార్డులు వంటి సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్దుష్ట వ్యవధిని నిర్దేశించింది. మందకొడిగా వ్యవహరించిన, ఆ వ్యవధిని పాటించని అధికారులు అందుకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ను దరఖాస్తు అందిన రోజే జారీ చేయాలి. శాశ్వత లైసెన్స్ ను ఒక రోజులోగా జారీ చేయాలి. అదేవిధంగా ఎన్నికల గుర్తింపు కార్డులను ఒక నెలలోపు, రేషన్ కార్డులను 45 రోజుల లోపు జారీ చేయవలసి ఉంటుంది.
అధికారి బాధ్యత స్థాయిని బట్టి వారు చెల్లించవలసిన జరిమానా రోజుకు రూ. 10, రూ. 200 మధ్య ఉంటుంది. 'ప్రతి విభాగంలో పనిని అధికార యంత్రాంగం క్రమానికి తగినట్లుగా నిర్దేశించడమైనది. దరఖాస్తును ప్రాసెస్ చేసే ప్రతి దశకు ఒక వ్యవధిని సూచించడమైనది' అని కార్యదర్శి (ఐటి) సవితూర్ ప్రసాద్ తెలియజేశారు. 2010 ఏప్రిల్ 1 నుంచి కార్యరూపం దాల్చనున్న ఈ ఉత్తర్వును ఒక అంతర్గత ప్రాజెక్టుగా ఈ నెలారంభంలో అనేక విభాగాలలో అమలులోకి తీసుకువచ్చారు. ఈ వ్యవస్థ స్థిరీకరణ జరిగిన తరువాత దీనిని జనానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News Posted: 16 December, 2009
|