ఎరగా భాగ్యనగరి? హైదరాబాద్ : తెలంగాణ వ్యతిరేక ఉద్యమకారులను బుజ్జగించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియకు మార్గం సుగమం చేయడానికై హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా ప్రకటించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నది. కాంగ్రెస్ అధిష్ఠానం సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్ నగరానికి కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపత్తి మంజూరు చేస్తే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి అంతగా ప్రతిఘటన లేకుండానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం కాగలదని అధిష్ఠానం విశ్వసిస్తున్నది. హైదరాబాద్ పై హక్కును వదలుకుని, కేంద్ర పాలిత ప్రాంతం హోదా ప్రకటనకు వీలు కల్పించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకత్వానికి నచ్చజెప్పేందుకు ప్రాథమిక ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని టిఆర్ఎస్ నాయకులు ఇందుకు ససేమిరా అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం వారు, మజ్లిస్ ఇత్తేహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) నాయకులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినందున కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నదని ఆ వర్గాలు తెలియజేశాయి. హైదరాబాద్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ ను తెలంగాణ నుంచి విడదీయడానికి టిఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తుండగా ఇతర ప్రాంతాల నాయకులు యుటి ప్రతిపత్తికి సుముఖంగా ఉన్నారు. నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కూడా యుటి ప్రతిపత్తికే మద్దతు పలుకుతున్నారు.
అయితే, ఈ ప్రతిపాదన అమలుకు సాధ్యం కానిదని, ఎందుకంటే దీని వల్ల తీవ్ర విపరిణామాలు సంభవించగలవని తెలంగాణ సిద్ధాంతకర్త కె. జయశంకర్ అంటున్నారు. 'హైదరాబాద్ కు కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపత్తి కల్పన సాధ్యం కాదు. మంచిది కూడా కాదు. అసలు తెలంగాణ నడిబొడ్డులో కేంద్ర పాలిత ప్రాంతం మనుగడే సమస్యాత్మకం కాగలదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా దీనిని సృష్టిస్తే నగరానికి తెలంగాణ నుంచి నీటిని, విద్యుత్ ను సరఫరా చేయడానికి వారు అనుమతిస్తారా' అని జయశంకర్ అన్నారు.
Pages: 1 -2- News Posted: 17 December, 2009
|