సోనియా 'సంధి' చిట్కా? న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ఉపసంహరించే సూచనలు చేయకుండానే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశాంత పరిస్థితుల పునరుద్ధరణకు కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఒక వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఎంపిల మధ్య అగాధం పెరిగిపోయిన నేపథ్యంలో గురువారం జరగవలసిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సమావేశాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధి రద్దు చేశారు. సోనియా తెలంగాణపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని ముందు భావించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల సమయంలో సిపిపి సమావేశం అసలే జరగకపోవచ్చు. ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలు ఏ వైఖరి అనుసరించినా అది తటస్థ వైఖరే అయినప్పటికీ రాష్ట్రంలోని రెండు ప్రాంతాలవారు భిన్నంగా అన్వయించుకోవచ్చు, మరింతగా అలజడులు రేగవచ్చు.
రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా కాలహరణ వ్యూహాన్ని అధిష్ఠానం రూపొందిస్తున్నదని తెలంగాణ వ్యతిరేకులు, అనుకూలురు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు నిర్దుష్ట వ్యవధిని ప్రకటించనప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరగదని అధిష్ఠానం ఏ దశలోనూ ఎటువంటి సూచననూ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ''మీరు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు. కాని తెలంగాణ ప్రజలకు కావలసింది రాష్ట్ర విభజన. దీనిని మేము ఎలా పరిష్కరించాలి? ఉభయ పక్షాలను సంతృప్తి పరచడానికి ఏమి చేయాలి?' అని ప్రధాని మాతో కరాఖండిగా అన్నారు' అని ఎంపి ఒకరు చెప్పారు.
అయితే, బుధవారం ఉదయం మన్మోహన్ సింగ్ ను కలుసుకున్న ఎంపిలు టెలివిజన్ కెమెరాల ముందు భిన్న వాదనలు వినిపించారు. కొన్ని రోజులలోగా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనగలమని ప్రధాని హామీ ఇచ్చినట్లు వారు తెలియజేశారు. కాని, ముందు తమ ప్రచారోద్యమాన్ని నిలిపివేయాలని ఎంపిలకు స్పష్టం చేసినట్లు ఇతర కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఈ అంశంపై తమ మాటలు వినిపించేందుకు సీనియర్ నాయకులు ఎవ్వరూ - సోనియా గాంధి, మన్మోహన్ లేదా ప్రణబ్ ముఖర్జీ - అవకాశం ఇవ్వరని వారు తెలిపారు. 'మేము తెలంగాణను ఆలస్యం మాత్రమే చేయగలం కాని రాకుండా ఆపలేం' అని ఎంపి ఒకరు చెప్పారు.
శాంతి సామరస్యాలు పరిరక్షించవలసిందంటూ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిపిఎ) మంగళవారం రాత్రి ఒక ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యతిరేక ఎంపిలు దిగాలు పడ్డారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించేంత వరకు తెలంగాణ ఏర్పాటుకు తిరిగి ఎటువంటి చర్యా తీసుకోబోదమని ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఒక ప్రకటన చేయాలని ఆంధ్ర ఎంపిలు కోరినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. అయితే, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నంత వరకు అటువంటి ప్రకటన చేయజాలమని సిసిపిఎ సమావేశం అనంతరం వారికి చిదంబరం స్పష్టం చేశారు. సిసిపిఎ సమావేశంలో మిత్ర పక్షాలు ఆక్షేపణలు తెలియజేసిన విషయాన్ని ప్రస్తావించి ప్రణబ్ ముఖర్జీ తప్పించుకున్నారు. తదుపరి చేసే ఏ ప్రతిపాదననైనా యుపిఎ భాగస్వామ్య పక్షాలన్నీ ఆమోదించవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ విభజనను కొంత కాలం వాయిదా వేయడానికి సాకుల కోసం చూస్తున్న ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్, ఎన్ సిపి, డిఎంకె వంటి మిత్రపక్షాల అభ్యంతరాలు అక్కరకు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు కొందరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 17 December, 2009
|