తిలోదకాలే మేలు : టీజీ
హైదరాబాద్ : విభజన ప్రతిపాదనకు తిలోదకాలు ఇవ్వడమే ప్రస్తుతం రాష్ట్రంలో చెలరేగుతున్న ఆందోళనలను రూపుమాపడానికి ఉన్న ఏకైక పరిష్కారమని సమైక్యాంధ్ర సాధన ఉద్యమ కమిటీ కన్వినర్, కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచడం ద్వారా దేశం మరిన్ని ముక్కలు కాకుండా చూడడం, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో కూడా వేర్పాటువాద చిచ్చును రగల్చడంలో ఏది మంచిదో ఢిల్లీ పెద్దలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రకటన చేయడంలో కేంద్రం ఎలాంటి పొరపాటు చేయలేదని, ప్రజల స్పందన, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల అధిష్టానాలు తప్పిదం చేశాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తరువాతే ప్రజల మనోభావాలు బయటపడ్డాయని, సమైక్యాంధ్ర కోసం ప్రజలు ఉద్యమించడంతో ఇప్పుడు అన్ని పార్టీలూ వెనుకంజ వేస్తున్నాయని ఆయన వివరించారు.
సమైక్యాంధ్ర సాధన ఉద్యమ కమిటీ సారధిగా ఎన్నికైన వెంకటేష్ బుధవారం రాత్రి 'తెలుగుపీపుల్' తో ప్రత్యేకంగా మాట్లాడారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో కమిటీ లక్ష్యాలను వివరించారు. ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరపనున్నామని, అక్కడ ఉన్న ఎంపీల సహాయంతో అందుబాటులో ఉండే కోర్ కమిటీ సభ్యులను కలవడం, వీలైతే ప్రధాని మన్మోహన్, అధినేత్రి సోనియాగాంధీని కలిసి తమ అభిప్రాయాలను చెప్పడం, జాతీయ స్థాయిలో సమైక్యాంధ్రకు మద్దతు కూడ గట్టడం తమ తక్షణ కర్తవ్యాలని తెలిపారు. లోక్ సభ సమావేశాలు ముగిసేలోగా సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం రాకపోతే పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామాలు చేసిన తరువాత మాత్రమే రాష్ట్రంలో అడుగుపెట్టాలని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు రావద్దని చెప్పబోతున్నామని ఆయన వెల్లడించారు.
తాము ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నామని వెంకటేష్ తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఐక్యంగా నిర్ణయించడం ద్వారా ఉద్యమం కొనసాగింపునకు అఖిల పక్ష కమిటీని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీ నాయకుడు చిరంజీవి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయమని ఆయన అన్నారు. రాజకీయపార్టీ నాయకుడిగా, సినిమా గ్లామర్ ఉన్న చిరంజీవి ఉద్యమంలోకి వస్తే సమైక్యాంధ్ర పట్ల యువతలో అవగాహన పెరుగుతుందని, ఉద్యమం మరింత స్ఫూర్తిదాయకమైన రూపాన్ని సంతరించుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Pages: 1 -2- News Posted: 17 December, 2009
|