బాబుపై చిరు దెబ్బ హైదరాబాద్ : చిరంజీవి రాజీనామా దెబ్బ చంద్రబాబుపైనా పడింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు తన శాసనసభ్యత్వానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి గురువారంనాడు రాజీనామా చేశారు. దీనితో చంద్రబాబు నాయుడు కూడా సమైక్యాంధ్రకు సానుకూలంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ తీవ్ర స్థాయిలో వత్తిడిలు ప్రారంభమయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటికే పాల్గొంటున్న కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన టిడిపి నాయకులు రాజీనామా చేయాలంటూ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా తమ పార్టీ మద్దతు ఇవ్వాల్సింది సమైక్య ఆంధ్రకా లేక ప్రత్యేక తెలంగాణకా అనేది తేల్చుకునే ముందు వేచి చూసే ధోరణినే చంద్రబాబు ఇంతవరకూ అనుసరిస్తున్నారు.
శాసనసభలోని 92 మంది టిడిపి ఎంఎల్ఎలలో 39 మంది తెలంగాణ ప్రాంతంవారు. సమైక్య ఆంధ్రకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన పక్షంలో తెలంగాణ టిడిపి స్థాపనకు తాము వెనుకాడబోమని వారు ఇప్పటికే హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో 'తనంతట తాను నిర్ణయం తీసుకోని పరిస్థితినే నాయుడు కోరుకుంటారు. కాని తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఆయన సమైక్య ఆంధ్రకే మద్దతు ఇస్తారు. అప్పుడు పార్టీలో చీలిక వస్తుంది' అని రాజకీయ విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు. శాసనసభ నుంచి రాజీనామా చేయాలన్న తన నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించిన అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు మీడియాకు దూరంగా ఉంటున్నారు. 'ప్రస్తుతం మౌనమే ఉత్తమం. కాని అలా ఆయన ఎంత కాలం ఉండగలరనేదే పెద్ద ప్రశ్న' అని టిడిపి నాయకుడు ఒకరు అన్నారు.
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రాజకీయ సంక్షోభం పరిష్కారానికి కేంద్రం పటిష్ఠమైన చర్యలు తీసుకునేంత వరకు నిరీక్షించిన తరువాత ఏ మార్గం అనుసరించాలో తాము నిర్ణయం తీసుకోగలమని రెండు రోజుల క్రితం వరకు కూడా చంద్రబాబు, చిరంజీవి చెబుతూ వచ్చారు. 'చిరంజీవి ఇప్పుడు సమైక్యాంధ్ర రంగంలోకి దూకడంతో త్వరగా ఏదో ఒకటి తేల్చాలంటూ చంద్రబాబుపై తెలంగాణేతర టిడిపి ఎంఎల్ఎలు నేడో రేపో ఒత్తిడి తీసుకురాగలరు' అని టిడిపి నాయకుడు ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 18 December, 2009
|