తుఫాను ముందు ప్రశాంతత హైదరాబాద్ : ఎనిమిది రోజుల క్రితం ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు, దౌర్జన్య సంఘటనలకు రంగస్థలంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని మౌనం ఆవహించింది. అయితే, ఇది తుఫాను ముందు ప్రశాంతత వంటిదని కొందరు అంటున్నారు. 'కేంద్ర ప్రభుత్వం తన మాట మీద నిలబడడం లేదనే అభిప్రాయం మాకు కలిగిన మరుక్షణం మేము తిరిగి ఆందోళన లేవదీస్తాం' అని విద్యార్థి నాయకుడు ఒకరు చెప్పారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సమైక్య ఆంధ్ర కోసం ఉద్యమం ఉధృతరూపం దాలుస్తుండడాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసే అవకాశం లేకపోలేదని ఆయన అంగీకరించారు.
'తెలంగాణ ఉద్యమం తిరిగి ప్రజ్వరిల్లబోతున్నది. కోస్తా ఆంధ్రలోని అగ్రవర్ణాలు తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న తీరుకు ఈ ప్రాంతంలోని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. రానున్న రోజులు ఉద్రిక్తంగా, నిర్ణయాత్మకంగా మారిపోవచ్చు' అని వరంగల్ లో సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకుడు మదన్ మోహన్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) ప్రతినిధితో అన్నారు. 'ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమానికి ప్రధానంగా విద్యార్థులే సారథ్యం వహించారు. కాని ఆంధ్రలో ఉద్యమానికి నాయకులు సారథ్యం వహిస్తున్నారు. అగ్రవర్ణాలవారు, వాణిజ్య ప్రయోజనాలు చూసుకునే వారు అందుకు మద్దతు ఇస్తున్నారు' అని విద్యార్థి నాయకుడు పేర్కొన్నారు.
'జెఎసిలో వెనుకబడిన తరగతుల (బిసిల)కు చెందిన విద్యార్థులదే ఆధిపత్యం. కెసిఆర్ కుటుంబాన్ని మినహాయిస్తే, తెలంగాణలో ఉద్యమం ప్రజల ఆశయాకాంక్షలకు దర్పణం పడుతున్నది' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి చెప్పారు.
సమైక్య ఆంధ్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న నాయకులు లగడపాటి రాజగోపాల్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, జె.సి. దివాకరరెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు, వారి అనుచరులు. 'అక్కడి నాయకత్వాన్ని పరికించండి. వారిలో ఒక్కరు కూడా దిగువ కులాలకు చెందినవారు కారు. వారు కమ్మవారు, రెడ్లు, కాపులు' అని సింహాద్రి పేర్కొన్నారు. 'వారంతా ఇప్పుడు సంఘటితమయ్యారు. తదుపరి దశలో రాయలసీమ రెడ్లు ఆధిపత్యం కోసం కోస్తా ఆంధ్ర కమ్మవారితో పోరు సాగిస్తారు. ఇక కాపులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సరైన మిత్రుల కోసం చూస్తుంటారు' అని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 18 December, 2009
|